ఎర్రకోటలోంచి గులాబీ తోటలోకి..


Tue,September 11, 2018 11:40 PM

-టీఆర్‌ఎస్‌లో చేరనున్న సీపీఐ సీనియర్ నేత పెండెల అయిలయ్య
-ఈనెల 14న 300ల మందితో పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో సంప్రదింపులు
-హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: ఎర్రకోటలోంచి గులాబీ తోటలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. ఏండ్ల తరబడి ఎర్రపార్టీలో పనిచేసిన సీనియర్ నేతలు సైతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఎర్ర పార్టీ అయిన సీపీఐ కోటకు బీటలు పడుతుండగా టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండుతున్నది. కేవలం సీపీఐ మాత్రమే కాకుండా ఇతర పార్టీల నుంచి, వివిధ సంఘాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజల నుంచి, పార్టీల నాయకులనుంచి వస్తున్న స్పందనను బట్టి హుస్నాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని టీఆర్‌ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీటీసీ, ఉమ్మడి హుస్నాబాద్ మండలంలోని గోవర్థనగిరి గ్రామానికి చెందిన పెండెల అయిలయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనది. ఈ నెల 14న 300 మంది అనుచరులతో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ విషయంపై మంగళవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండ ప్రకాశ్‌లతో అయిలయ్య కోడలు, గోవర్థనగిరి ఎంపీటీసీ పెండెల రమ ఇతర కుటుంబ సభ్యులు సంప్రదింపులు జరిపారు. 33 ఏండ్లుగా సీపీఐలో పనిచేసిన అయిలయ్య పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో సీపీఐకి గట్టి దెబ్బతగిలినట్లయింది.

1985 నుంచి అయిలయ్య రాజకీయ ప్రస్థానం
సింగిల్ విండో డైరెక్టర్‌గా 1985లో ఎన్నికైన అయిలయ్య తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటికే రేగొండ మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. సీపీఐ కార్యకర్తగా కెరీర్‌ను ప్రారంభించారు. 1995లో తన భార్య పోచవ్వ సర్పంచ్‌గా ఎన్నిక కాగా, 2004లో అయిలయ్య ఎంపీటీసీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తన కోడలు పెండెల రమ ఎంపీటీసీగా ఎన్నికైంది. ఇక పార్టీలో పలుమార్లు మండల కార్యదర్శిగా, కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం సీపీఐ రాష్ట్రకౌన్సిల్ సభ్యుడిగా ఉన్న అయిలయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

అభివృద్ధి కోసం చేరుతున్నా..
సుమారు మూడు దశాబ్దాలుగా పనిచేసిన సీపీఐ పార్టీని వీడాలంటే బాధగా ఉన్నప్పటికీ హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం చేస్తున్న కృషికి ఆకర్షితుడినయ్యా. సీపీఐ పార్టీ ప్రజాదరణ కోల్పోతున్నది. టీఆర్‌ఎస్‌లో చేరి ఈ ప్రాంత ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో వస్తున్నా. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ నిస్వార్థ సేవలు, ఆయనలోని సేవాగుణం, నియోజకజవర్గానికి మంచి చేయాలనే తపన ఉన్న వ్యక్తి కాబట్టే ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు ముందు వచ్చాను. ఈ నెల 14వ తేదీన సుమారు 300మందితో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరుతాను.
-పెండెల అయిలయ్య

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...