పరమశివుడికి ఘనంగా రుద్రాభిషేకం


Tue,September 11, 2018 01:10 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. పరమశివుడికి విశేష సంఖ్యలో భక్తజనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండడంతో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుడిని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివుడిని విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాతవేళ జరిగే రుద్రాభిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ఉప ప్రధాన పురోహితుడు గౌరీబట్ల నర్సింహరాములుశర్మ ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు నిత్య కల్యాణోత్సవం జరిపించారు.


133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...