పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ


Tue,September 11, 2018 01:10 AM

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోసం అధికారులు, ఉద్యోగులు సిద్ధ్దంగా ఉండాలని కలెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోసం జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పది రోజుల్లో జిల్లాకు 1740 ఈవీఎంలు, 1740 వీవీ ప్యాట్లు, 1360కంట్రోల్ యూనిట్లు రానున్నట్లు తెలిపారు. వీటిని భద్రపరిచేందుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లోని గోదామును, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలను పరిశీలించామన్నారు. అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ కోసం అనువుగా ఉండే కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు కలిపి 1089 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతంలో 1400ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం, గ్రామీణ ప్రాంతంలో 1200ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన తరువాత వీవీ ప్యాట్ల ద్వారా ఓటరు ఎవరికి ఓటు వేస్తే వాటికి సంబంధించిన ప్రింట్ వస్తుందన్నారు. దీంతో ఈవీఎంలపై వందశాతం నమ్మకం పెరుగుతుందని చెప్పారు. అధికారులు సైతం ఈవీఎంల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. బూత్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్ల లిస్టులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. చేర్పులు, మార్పులు సైతం చేయాల్సి ఉంటుందన్నారు. చనిపోయిన వారి ఓట్లను వెంటనే తొలగించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.చంద్రయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ మహిపాల్‌రెడ్డి, ఆర్డీఓ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...