చెక్కు చెదరని చెరువులు


Mon,September 10, 2018 03:11 AM

- మిషన్ కాకతీయతో జిల్లాలో అద్భుత ఫలితాలు
- ఒక్కరాత్రిలో 19.3సెం.మీటర్ల వర్షం
- అలుగుపోసిన చెరువులు 122, 1136చెరువులకు జలకళ
- పెరిగిన భూగర్భజలాలు.. బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లు
- జిల్లాలో అదనంగా పెరిగిన 45వేల ఎకరాల ఆయకట్టు
సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణలో వ్యవసాయానికి ఆయువుపట్టు అయిన చెరువులు సమైక్యపాలకులకు పట్టలేదు. కాకతీయుల కాలంలో తవ్విన చెరువులు రోజురోజుకూ పూడుకుపోయి మైదానాలుగా మారిన తరుణంలో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టింది. తద్వారా చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చింది. ఆ బృహత్తర పథకం తాలూకూ ఫలాలు నేడు గ్రామాల్లో సాక్షాత్కరిస్తున్నాయి. నాలుగు విడుతలుగా చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులన్నీ బాగుపడ్డాయి. ఎక్కడా చుక్క నీరు వృథా కావడం లేదు. జిల్లాలో ఆగస్టు 19న 19.3సెం.మీ. భారీ వర్షం కురిసింది. ఒకే ఒక్కరాత్రికే వరద ముంచుకొచ్చింది. అయినప్పటికీ ఏ ఒక్క చెరువూ చెక్కు చెదరలేదు. జిల్లాలోని 1258చెరువులకుగాను 261చెరువులు వందశాతం నిండగా 122చెరువులు అలుగులు పోశాయి. మిగిలిన చెరువుల్లో 25నుంచి 75శాతం నీటితో జలకళను సంతరించుకున్నాయి. చుక్కనీరు లీకేజీ లేకపోవడంతో నేడు రైతుల సంతోషం అంతా ఇంతా కాదు.

ఒక్క గండీ పడలేదు..
గతంలో చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయన్న సంతోషం గంటల వ్యవధిలోనే నీరుగారి పోయేది. నాటి ప్రభుత్వాలు చెరువులకు నయాపైసా వెచ్చించక గాలికి వదిలేయడంతో అన్ని చెరువులు దాదాపు శిథిలావస్థకు చేరాయి. కాగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాలో చెరువుల ఆధునీకరణ కోసం నాలుగు విడుతలుగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో రూ.375.40కోట్లతో 930చెరువుల ఆధునీకరణ చేపట్టారు. మొదటి విడుతలో 235చెరువులు, రెండో విడుతలో 296చెరువులు వందశాతం పూర్తికాగా, మూడో విడుతలో 220చెరువుల్లో 80శాతం పనులయ్యాయి. నాలుగో విడుతలో జిల్లావ్యాప్తంగా 179చెరువుల్లో పూడిక తీసి ఆధునీకరించాల్సి పరిపాలన అనుమతుల అనంతరం తాజాగా పనులు మొదలయ్యాయి. 35 నుంచి 50శాతం పనులు కూడా పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

45వేల ఎకరాలకు పైగా పెరగనున్న సాగు
ఇటీవల కురిసిన భారీ వర్షానికి జిల్లాలో చెరువులు జలకళను సంతరించుకోగా జిల్లాలో వ్యవసాయశాఖ వానకాలం పంటలకు వేసిన అంచనా విస్తీర్ణానికి అదనంగా మరో 45వేల ఎకరాలకుపైనే పెరుగబోతోంది. 2018వానకాలం సాగుకు జిల్లా వ్యాప్తంగా 1,52,650 హెక్టార్లలో పంటల సాగు అవుతాయని అంచనా వేయగా వీటిలో 70,909హెక్టార్లలో వరి ఉంది. చెరువుల్లోకి నీరు చేరడం ద్వారా అదనంగా 18000హెక్టార్లు(45000)వరి సాగు కాబోతున్నది. ఈ మేరకు జిల్లాలోని మోతె, తుంగతుర్తి నూతనకల్, మద్దిరాల, అర్వపల్లి, తిరుమలగిరి, మద్దిరాల, నాగారం, ఆత్మకూర్.ఎస్, చివ్వెంల తదితర మండలాల్లో చెరువులు నిండడంతో ఆయా గ్రామాల రైతులు నేడు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం మీద తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ ఏడాది జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కావడం, మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడడంతో చుక్కనీరు కూడా వృథా కాకుండా నిలవడంతో రైతుల్లో పట్టరాని ఆనందం కనిపిస్తుంది.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...