ఉమ్మడి 12స్ధానాల్లో గులాబీ జెండా ఎగరేస్తాం..


Sun,September 9, 2018 02:57 AM

-ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతే
-టీఆర్‌ఎస్ అభ్యర్థులకు భారీ ఆదరణ లభించడమే దీనికి నిదర్శనం
-అనైతిక పొత్తులతో ఆ పార్టీలు బంగాళాఖాతంలోకి
-రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు తగులడం.. ఆసత్య ఆరోపణలు చేయడం.. పనులు మొదలు పెట్టకముందే అవినీతి అంటూ రాద్ధాంతం చేయడంతో విసిగి వేసారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి దమ్మేంతో ప్రజల్లోనే తేల్చుకుందామని అసెంబ్లీని రద్దు చేస్తే.. ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన ప్రతిపక్షాలు అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలంటూ దద్దమ్మల్లా పారిపోతున్నారని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన అనతరం తొలిసారిగా శనివారం జగదీశ్‌రెడ్డి సూర్యాపేటకు వచ్చారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు, పెద్ద ఎత్తన మహిళలు, స్థానికులు తరలివచ్చి స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతవుతాయని చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాల్లోకి వస్తే ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించడమే ఇందుకు నిదర్శనమన్నారు. క్యాబినెట్ రద్దు అని ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని.. ఎటూ పాలుపోక అనైతిక పొత్తులతో ప్రజల్లో ఉన్న కొద్దిపాటి ఆదరణ కొల్పోతున్నారన్నారు.

కాంగ్రెస్ కూడా బంగాళాఖాతంలోకే
తెలంగాణలో పూర్తిగా తుడిచిపోట్టుకుపోయి బంగాళాఖాతంలో కలిసిన తెలుగుదేశం పార్టీతో నేడు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని అంతకంటే హీనం మరోటి ఉండదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కూడా బంగాళాఖాతంలో కలవడం ఖాయమని చెప్పారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారనే నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ 30 ఏళ్లుగా అదే నినాదంతో పనిచేసిందని, ఆ పార్టీ తెలంగాణపై చేసిన కుట్రల ఫలితంగా ప్రజలే టీడీపీని నామరూపాల్లేకుండా చేశారన్నారు. కొద్దోగొప్పో ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ధృతరాష్ర్టుడు లాంటి చంద్రబాబు కౌగిలిలోకి వెళ్లడం ద్వారా ఆ రెండు పార్టీలు బంగాళాఖాతంలో కలుస్తాయన్నారు. నేడు తెలంగాణ పరిమళాలను ప్రపంచానికి చాటుతున్న టీఆర్‌ఎస్ పక్షాన ప్రజలు ఉండడంతో ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి అన్నారు. ఇంతగొప్ప పాలన చేసే కేసీఆర్‌ను మనకు కాకుండా చేయాలనే కుట్రలు చేస్తున్న ప్రతిపక్షాలను మటుమాయం చేయాలనే ప్రజలు భావిస్తున్నారన్నారు.

రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా
అభ్యర్థిగా సూర్యాపేటకు వచ్చిన తనకు పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలుకడం ద్వారా 2014లో వచ్చిన మెజారిటీకి పదింతలు వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. వారిచ్చిన ప్రోత్సాహంతో వచ్చే ఐదేళ్ల పాటు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా సూర్యాపేటకు వచ్చిన సమయంలో తనను ప్రజలు ఏ రకంగా ఉత్సాహంతో స్వాగతించారో అంతకు మించి నాలుగు రెట్ల ఉత్సాహంతో నేడు స్వాగతం పలికారంటే నాలుగున్నరేళ్లలో ప్రజల్లో ఆదరణను పెంచుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుందన్నారు. 2014లో ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వచ్చిన సందర్బంగా ఇచ్చిన హామీలన్నీ నేడు అక్షరాల అమలయ్యాయన్నారు. దీంతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు వచ్చాయని, ప్రధానంగా మెడికల్ కళాశాలను పేటకు ఇవ్వడం అందరికీ తెలిసిందే అన్నారు.

భయాల నుంచి సంతోషంలోకి
2014కు ముందు సూర్యాపేటలో ప్రజలు భయాందోళనలో జీవించేవారని గుర్తు చేశారు. పేటలో స్థలాలున్న వారు ఎవరు ఎప్పుడు వచ్చి ఖబ్జా చేస్తారో అనే భయంతో ఉండేవారని, టీఆర్‌ఎస్ పాలనలో నాలుగేళ్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజలు హాయిగా ఉన్నారని పేర్కొన్నారు. 2014లోనే ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాకుండా ప్రతిపక్షాల కుట్రలన్నీ ప్రజలు గుర్తించినందున త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లతవడం, టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల ఆనంద్, నెమ్మాది భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ ఒట్టె జానయ్యయాదవ్, గండూరి ప్రకాశ్, ఎంవీఎల్ తదితరులు పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...