పదిలో ప్రైవేటుకు మంగళం


Wed,January 11, 2017 02:15 AM

-పరీక్షల విధానంలో సంస్కరణలు
-రెగ్యులర్ విద్యార్థులకే అవకాశం
-ఈ ఏడాది నుంచే అమలు
-మార్కుల కేటాయింపులో మార్పులే కారణం

కోదాడ, నమస్తే తెలంగాణ : కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి కోసం ప్రైవేటుగా పదో తరగతి పరీక్షకు హాజరయ్యేవారు. వారితోపాటు బతుకుదెరువుకు ఇతరప్రాంతాలకు వలసవెళ్లినవారు ప్రైవేటుగా ఫీజు కట్టి పరీక్షల సమయంలో ఆయా సెంటర్లకు వచ్చి పరీక్షలు రాసేవారు. అదే విధంగా గతంలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయి చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చినవాళ్లు, తిరిగి చదువు కొనసాగించాలనుకునేవారికి ప్రైవేటు మార్గంగా ఉండేది.

ఇలా ప్రతి సంవత్సరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4 వేల నుంచి 5 వేల మంది హాజరయ్యేవారు. ఇప్పుడలా రాసేవారందరికీ అవకాశం లేకుండాపోయింది. పరీక్షల విధానంలో మార్పులు చేయడంతో ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నమోదు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెగ్యులర్‌గా చదివితేనే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసమైనా పాఠశాలల్లో చేరుతారు. రాతపరీక్షే కాకుండా విద్యార్థుల సామర్థ్యానికి మార్కులు కేటాయించడం వల్ల తరగతులకు తప్పక హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ విధానంతో ఇకనుంచి పరీక్షల్లో అక్రమాలు తగ్గనున్నాయి.

ఓపెన్ స్కూళ్లే ప్రత్యామ్నాయం...


పదో తరగతి పరీక్షలకు ప్రైవేటును రద్దుచేయడంతో అలా రాయాలనుకున్నవారికి ఓపెన్ స్కూళ్లే ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నాయి. ఇప్పటి దాకా ప్రైవేటుగా రాసే అవకాశం ఉండడంతో చాలా మంది సార్వత్రిక పాఠశాలల వైపు హాజరయ్యేవారు కాదు. సమగ్ర మూల్కాంకనంలో భాగంగా నిర్మాణాత్మక మూల్యాంకనానికి కేటాయించిన 20 మార్కులు పూర్తిగా విద్యార్థుల సామర్థ్యాలపైనే ఆధారపడి ఉన్నాయి. వీటిని అంచనా వేసి ఉపాధ్యాయులు మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో గుర్తింపులేని పాఠశాలల యాజమాన్యాలు గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను ప్రైవేటుగా పరీక్ష రాయించేవారు. ఇప్పుడు ఈ విధానంతో అలాంటి వారి ఆటలు ఇక సాగవు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS