హద్దుదాటుతోంది...


Tue,January 10, 2017 02:24 AM


హుజూర్‌నగర్, నమస్తే తెలంగాణ: పేదల ఆకలిని సంపూర్ణంగా తీర్చే లక్ష్యంతో సీలింగ్ ఎత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం. సరిపడా బియ్యం సరఫరా చేసి కడుపు నింపడమే ప్రభుత్వ సదాశయమైతే.. పదో పరకో ఆశజూపి ఆ బియ్యాన్ని సరిహద్దులు దాటించి అక్రమార్జన పొందడమే కొందరి దురుద్దేశంగా మారింది. రూపాయికి కిలో బియ్యానికి పేలాలు, ముగ్గు, ఉప్పు, గుడ్ల వంటి ఆశలుజూపి పోగు చేస్తున్న అక్రమార్కులు.. అడ్డదారుల్లో ఆ బియ్యాన్ని రాష్ట్రం సరిహద్దులు దాటిస్తున్నారు. కృష్ణా తీరం వెంట వ్యాపించి ఉన్న దామరచర్లతోపాటు నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెర్వు మండలాలే గాకుండా కోదాడ, నాగార్జునసాగర్ సరిహద్దుల ద్వారా పీడీఎస్ బియ్యం ఆంధ్రాకు చేరుతోంది. బడా వ్యాపారుల ప్రలోభాలకు లొంగిన పల్లెల్లోని కొందరు అమాయకులు.. బియ్యం సేకరించే దందాను కుటీర పరిశ్రమగా మార్చుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నిరుపేదకు ఆరు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తోంది. అయితే, ప్రభుత్వ లక్ష్యాన్ని కొంతమంది అక్రమార్కులు నీరుగారుస్తున్నారు. పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పట్టిస్తూ దందా సాగిస్తున్నారు. యథేచ్ఛగా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ పరిస్థితి కృష్ణా తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మధ్యతరగతి, ఆర్థికంగా ఉన్నవారు పీడీఎస్ బియ్యం తినకపోవడంతో దళారులు గ్రామాల్లో వాలిపోయి కిలో బియ్యం రూ.9-10 చెల్లించి పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. కృష్ణాతీరంలోని దామరచర్ల, నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెర్వు మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో బియ్యం సేకరణ కుటీర పరిశ్రమగా మారింది.

ముగ్గు, బొంగుల పేరిట కొనుగోలు..


ఆంధ్రాకు చెందిన వ్యాపారులు ఉప్పు, ముగ్గు, బొం గులు, పేలాలు, గుడ్లు అమ్ముకోవడానికి వచ్చి పీడీఎస్ బియ్యం మార్పిడి చేసుకుంటున్నారు. బియ్యానికి సరిపడా సరుకులు ఇస్తూ సేకరిస్తున్నారు. గుంపులుగా వస్తున్న వీరు బియ్యాన్ని కొనుగోలు చేసి పెద్ద ఎత్తున నిల్వచేసి అక్కడ నుంచి కృష్ణానది మీదుగా పడవల్లో ఆంధ్రాకు తరలిస్తున్నారు. దామరచర్ల మండలంలో మండలంలోని కేజీఆర్ కాలనీ, దామరచర్ల, కొండ్రపోల్, వీర్లపాలెం, వీరప్పగూడెం, దిలావర్‌పూర్, తెట్టెకుంట, నూనావత్‌తండా, వాచ్యతండా, బొత్తలపాలెం గ్రామాల్లో రేషన్ బియ్యం జోరుగా సాగుతుంది. దళారులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ తీరం దాటించి ఆటోల్లో, టాటాఏసీల్లో దాచేపల్లికి తరలిస్తున్నారు. దళారులు మండలాల వారీగా ఏజెంట్లను పెట్టుకుని బియ్యం సేకరించడం గమనార్హం. ఈ వ్యాపారాలు చూస్తే చిల్లరగా కనిపిస్తాయి. నెల తర్వాత వీరు సేకరించిన బియ్యం టన్నుల కొద్దీ తరలిపోతోంది. దామరచర్ల మండలంలోని దూ ద్యాతండాలో ఓ మహిళ పేలాల పేరిట నెలరోజుల్లో 17క్వింటాళ్ల రేషన్ బియ్యం సేకరించడం మచ్చుకు మాత్రమే.

అక్రమ రవాణాకు తివాచీ పర్చిన పుష్కర రోడ్లు..


కృషా ్ణపుష్కరాల సమయంలో భక్తుల సౌకర్యం కోసిన వేసిన అంతర్గత, బైపాస్ రహదారులు పీడీఎస్ బియ్యం దళారులకు కలిసొస్తున్నాయి. ఈ రహదారులపై ఎలాంటి నిఘా లేకపోవడం, జనసంచారం లేకపోవడం సులువుగా మారింది. త్రిపురారం, నిడమనూరు, మిర్యాలగూడ, నేరేడుచర్ల మండలాల నుంచి దామరచర్లకు చేరుకునేందుకు పుష్కరాలకు ఏర్పాటు చేసిన బై పాస్‌లు, అంతర్గత రోడ్లు రేషన్ బియ్యం అక్రమ తరలింపునకు ఉపయోగపడుతున్నాయి. ఈ రహదార్ల వెంట ఆటోలు, టాటా ఏస్ వాహనాల ద్వారా వాడపల్లి చెక్‌పోస్టు మీదుగా ఆంధ్రాకు వెళ్తున్నాయి. దీంతో పాటు అడవిదేవులపల్లి మండలంలోని టేల్‌పాండు నుంచీ రేష న్ బియ్యం తరలిస్తున్నారు. మేళ్లచెర్వు, మఠంపల్లి మండలాల్లో నదిని దాటడానికి ఉపయోగించే బల్లకట్టు ద్వారా కూడా బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోంది. పలుమార్లు పట్టుబడి, కేసులు నమోదు చేసినా తిరిగి అదే వ్యాపారంలో కొనసాగడం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఆంధ్రా సరిహద్దుల ద్వారా..


హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మట్టపల్లి, బుగ్గమాదారం, చింత్రియాలలో ఉన్న బల్లకట్ల ద్వారా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో సేకరించిన పీడీఎస్ బి య్యాన్ని ఆంధ్రా ప్రాం తానికి తరలిస్తున్నారు. మరికొన్ని సార్లు పీడీఎస్ బి య్యం ఆంధ్రా ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఖమ్మం, కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల నుంచి కాకినాడ రేవు ద్వారా ఇతర రాష్ర్టాలకు రవాణా అవుతున్నట్లుగా సమాచారం. కో దాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఆంధ్రా సరిహద్దు ప్రాం తాలుండటం వల్ల బల్లకట్టు ద్వారానే కాకుండా మేళ్లచెర్వు, కోదాడ మండలాల్లోని సరిహద్దు గ్రామాలకు పక్కనే ఉన్న ఆంధ్రా ప్రాంతాలైన చైర్మన్‌పేట, వత్సవాయి, మక్కపేట, నందిగామ, గౌరారం, భూదాడులలో అక్రమంగా సేకరించిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నెల 7న చింత్రియాల బల్లకట్టు ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఉప్పుడు బియ్యం లారీ కృష్ణానదిలో పడిపోవడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.

లోపించిన నిఘా...


నిఘా లోపించడం వల్లనే రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారుల కళ్లుగప్పి రోజూ వందలాది టన్నుల రేషన్ బియ్యం ఆంధ్రాకు తరలిస్తున్నారు. అక్రమార్కులు ముందస్తుగా ద్విచక్రవాహనంపై వెళ్తూ వెనుకాల వచ్చే బియ్యం వాహనానికి సూచనలు చేస్తుంటారు. ఎక్కువగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున సమయాల్లో రవాణా చేస్తున్నారు. ఇక ఆటోలైతే పట్టపగలే వెళ్తున్నా పట్టింపులేదు.

పకడ్బందీ చర్యలు.


పీడీఎస్ బియ్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఆరు నెలల్లో 25కేసులు నమోదు చేశాం. పల్లెల్లో ముగ్గు, ఉప్పు, గుడ్లు, పేలాల పేరా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా పెట్టాం. బియ్యం ఎక్కువగా రాత్రి వేళల్లో తరలిపోతున్నట్లు తెలుస్తోంది. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసినా, అమ్మినా పీడీయాక్టు నమోదు చేస్తాం.
- దీపక్, సివిల్ సప్లయ్ డీటీ, దామరచర్ల

ఇటీవల పట్టుబడిన బియ్యం


-15 రోజుల క్రితం నడిగూడెం మండలానికి చెందిన ఒక వ్యక్తి లారీలో బియ్యం తరలిస్తుండగా నందిగామలో పట్టుకున్నారు.
- నవంబర్‌లో మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లిలో 120 క్వింటాళ్ల బియ్యం పట్టివేత, ముగ్గురు డీలర్లపై కేసులు నమోదు.
-ఇదే నెలలో మేళ్లచెర్వు మండలంలోని హేమ్లాతండాలో 5 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
- కోదాడలోని కూచిపూడి గ్రామంలో 10 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
-మార్చి నెలలో హుజూర్‌నగర్‌లో ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 255 క్వింటాళ్ల బియ్యం లారీ పట్టివేత
- ఫిబ్రవరిలో పాల వ్యానులో 244 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

పీడీఎస్ బియ్యం దందా చేస్తే పీడీయాక్టే


హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పీడీఎస్ బి య్యం ను అమ్మినా, కొన్నా కఠినచర్యలు తీసుకుంటున్నాం. నవంబర్‌లో మఠంపల్లి మం డలంలోని గుండ్లపల్లిలో 12 0 క్వింటాళ్ల బియ్యం పట్టుకుని ముగ్గురు డీలర్లపై కేసులను నమోదు చేశాం. బియ్యం తరలిస్తున్నవారిపై కూడా కేసులను నమోదు చేశాం. పదే పదే పీడీఎస్ బియ్యం కేసులో చిక్కుకుంటే వారిపై పీడీయాక్ట్‌ను పెట్టనున్నాం. - నర్సింహారెడ్డి, సీఐ

కందిబండలో 165 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత


మేళ్లచెర్వు : మండలంలోని కందిబండలో మూడు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. విజిలెన్స్ సీఐలు జేసీ రాజు, నర్సింహరాజులు తెలిపిన వివరాల ప్రకా రం. .గ్రామంలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచారన్న విశ్వసనీయ సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ భాస్కర్‌రావు ఆదేశాల మేరకు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన రాఘవరావు , శ్రీను, నాగేశ్వరరావులు మూడు వేర్వేరు చోట్ల నిల్వ ఉంచిన 165 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిపై 6 (ఏ) కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సమీప డీలర్‌కు అప్పగించారు. ఈ దాడులలో విజిలెన్స్ ఎస్‌ఐ గౌస్, ఆర్‌ఐ శ్రీనివాస్, వీఆర్వో శ్రీనివాస్, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS