ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించాలి

Tue,January 10, 2017 02:20 AM


సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ప్రజా సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించాలని కలెక్టర్ సురేంద్రమోహన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞాపనలను పరిశీలించి సమస్యల తీవ్రతను చర్చించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలకు పరిపాలనను సన్నిహితం చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని... ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన విజ్ఞాపనలపై అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని అన్నారు. గత ప్రజావాణి వరకు సుమారు 3197విజ్ఞాపనలు వస్తే వాటిలో 1898 విజ్ఞప్తులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన వాటిని వారంలో పరిష్కరించాలని ఆదేశించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సామాన్య ప్రజలు చేనేత వస్ర్తాలు ధరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో పనిచేసే జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ చేనేత దుస్తులతో ప్రజావాణికి హాజరయ్యారు. వీరితో కలిసి కలెక్టర్ గ్రూప్ ఫొటో దిగారు.

డబుల్ బెడ్రూం ఇళ్లకే ఎక్కువ దరఖాస్తులు...


ప్రజావాణిలో అత్యధిక దరఖాస్తులు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసమే వచ్చాయి. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. దీంతో దరఖాస్తుదారులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా నిర్దేశించిన గ్రామాల్లో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలు చెప్పడుతున్నట్లు చెప్పారు. అర్హత గల ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

హరితహారానికి స్థలాలను పరిశీలించాలి


హరితహారం కింద ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పెరటి మొక్కలను నాటేందుకు ఇంటింటికీ తిరగి ప్రజలు కోరుకునే మొక్కలను నమోదు చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు.

మండలానికి మూడు నగదురహిత గ్రామాలు...


వారంలోగా ప్రతి మండలంలో మూడు గ్రామాలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు, చెక్‌బుక్ ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ డి.సంజీవరెడ్డి, డీఆర్వో యాదిరెడ్డి, డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

పింఛన్ ఇవ్వడం లేదు


పక్షవాతంతో నా శరీరంలోని ఎడమ భాగం చచ్చుపడింది. గత ఏడాది సదరం క్యాంప్‌లో పరీక్ష చేయించగా 100శాతం అవిటితనం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకూ నాకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ రావడం లేదు. మీరైనా పింఛన్ వచ్చేలా చూడండని కలెక్టర్‌ను వేడుకున్నారు
- రణపంగ సాత్విక్, లింగాల, పెన్‌పహాడ్ మం.

రెండు పడకల ఇల్లు ఇప్పిండండి


భార్యాభర్తలం వికలాంగులం. దీంతో మేము పని చేయలేకపోతున్నాం. మాకు పూట గడవడమే కష్టంగా మారింది. అంతేగాకుండా మేము ఉండేందుకు కనీసం ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం అందించే రెండు పడకల ఇల్లు అందించాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుని వేడుకున్నారు.
- బత్తుల లక్ష్మి, రామన్నగూడెం, ఆత్మకూర్,ఎస్ మం.

36
Tags

More News

మరిన్ని వార్తలు...