గులాబీ గూటికి ఎర్రదళం!

Tue,January 10, 2017 02:19 AM


సూర్యాపేట, నమస్తే తెలంగాణ : గులాబీ గూటికి మరోసారి భారీగా చేరికలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరగా ఈ సారి సీపీఎం వంతవుతుంది. సాధారణంగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేసే వారు సిద్ధాంతాలు, కట్టుబాట్లు అంటూ పార్టీకి పనిచేస్తుంటారు. కానీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కమ్యూనిస్టులు కూడా ఆకర్షితులవడం గమనర్హం. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు నూకల మధుసూదన్‌రెడ్డి, కార్మిక నాయకుడు వెంపటి గురూజీతోపాటు పలువురు నాయకులు మంగళవారం గులాబీ తీర్థం పుచుకోనున్నారు. 40 ఏళ్లుగా సీపీఎంలో వివిధ హోదాల్లో పనిచేసి కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న మధుసూదన్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. సీపీఎం చీలిక సమయంలో తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలలో పార్టీని నిలబెట్టి పునర్జీవం పోశాడు. 20ఏళ్ల పాటు సిరికొండ కో-ఆపరేట్ చైర్మన్, డైరెక్టర్‌గా పనిచేశారు.

అంతే కాకుండా సూర్యాపేట డివిజన్ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. ప్రస్తుతం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన చేరికతో మోతె మండల పరిధిలోని రావిపహాడ్, బుర్కచర్ల, హుస్సేనాబాద్, లాల్‌తండాలతోపాటు సూర్యాపేట పట్టణంలో పార్టీకి ఎదురుదెబ్బ తలగనుంది. కార్మిక నాయకుడిగా పేరున్న వెంపటి గురూజీ 31సంవత్సరాలుగా సీపీఎం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మునగాల మండలం జగన్నాథపురం సర్పంచ్‌గా , డీవైఎఫ్‌ఐ కోదాడ కార్యదర్శిగా పనిచేశారు. సూర్యాపేట సీఐటీయూ డివిజన్ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరితోపాటు మోతె మండల కార్యదర్శి యలమంచితోపాటు పట్టణానికి చెందిన కార్మిక సంఘాలు, సీపీఎం కార్యకర్తలు భారీగా గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ఖాళీ కాగా తాజాగా సీపీఎం నుంచి వలసలు ప్రారంభం కావడంపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

52
Tags

More News

మరిన్ని వార్తలు...