దోపిడీ దొంగల బీభత్సం..


Sat,November 9, 2019 11:22 PM

తొగుట: మండలంలోని గుడికందుల, గోవర్దనగిరి, ఘనపూర్ గ్రామాల్లో శుక్రవారం రాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ మూడు గ్రామాల్లో 13 ఇండ్లలో దోపిడీ ముఠా సభ్యులు దోపిడికి పాల్పడ్డారు. ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలతో వెళ్లి సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. పెండ్లిల్ల సీజన్ కావడంతో గ్రామాల్లో దగ్గరి వారి శుభకార్యాలకు ఇండ్లకు తాళాలు వెసి వెళ్తున్న విషయం గమనించిన దోపిడి దొంగలు పక్కా ప్లాన్ చేసుకొని వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. మొదట ఘనపూర్‌లో కన్నయ్యగారి అశోక్‌రెడ్డి, మరుపల్లి లింగంగౌడ్ ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. అక్కడ ఏమి దొరకకపోవడంతో గుడికందులలో చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులకొట్టి, బీరువాలను బద్దలు కొట్టి హన్మండ్లకాడి నర్సింహారెడ్డి ఇంట్లో రూ.18 వేల నగదు, 8 గ్రాముల బంగారం, వెంకట్‌రెడ్డిగారి సంజీవరెడ్డి ఇంట్లో 2 తులాల బంగారం, రూ.17 వేల నగదు, వెంకట్‌రెడ్డిగారి మహేందర్‌రెడ్డి ఇంట్లో 7 గ్రాముల బంగారం, 17 తులాల వెండి, రూ.7500 నగదు, చిన్నరాము గారి ప్రకాశ్ ఇంట్లో 7 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, రూ.7500 నగదు ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన అంచులూరి నారాయణ, ఉప్పరి సతీశ్, పాల కేంద్రంలో, కల్లు దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. అనంతరం గోవర్దనగిరిలో ఎం.డీ. ఖాజామొహినొద్దిన్ ఇంట్లో తులంన్నర బంగారం, రూ.10 వేలు, ఎం.డీ. నసీరొద్దీన్ కిరాణ షాప్‌లో రూ.2వేలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకొన్న మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి ఎస్‌ఐలు శ్రీనివాస్, సామ శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్‌లు సిద్దిపేట క్లూస్ టీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల వివరాలను సేకరించారు. సంఘటనకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నారు.

పక్కా ప్లాన్‌తో....
కారు మీద వస్తే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశ్యంతో దొంగలు పక్కా ప్లాన్‌గా చోరీలకు పాల్పడ్డారు. రాత్రి వేళలో ఇండ్ల ముందు కారు నిలిచి ఉండటంతో చూసిన వారు సైతం ఎవరైనా బంధువులు వచ్చారు కావొచ్చు అనుకున్నారు. తెల్లారే సరికి ఇండ్లలో దొంగలు పడ్డ విషయం గుర్తించి ఇంటి యజమానులకు సమాచారం అందించారు. శుభకార్యాలలో ఉన్న బాధితులు తమ ఇండ్లలో దొంగలు పడ్డారన్న విషయం తెలుసుకొని లబోదిబోమంటూ గ్రామాలకు చేరుకున్నారు. కాయకష్టం చేసిన డబ్బులు, బంగారం దొంగల పాలవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోవర్దనగిరి, గుడికందుల, ఘనపూర్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయకపోవడంతో నిఘా కెమెరాలకు వారు చిక్కకుండా పోయారు. గుడికందుల గ్రామంలో ఒక సీసీ కెమెరాలో మాత్రం రికార్డయింది. కారులో కొంత మంది, ద్విచక్ర వాహనంలో ముసుగు ధరించి వెల్లినట్టు పోలీసులు గుర్తించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...