దౌల్తాబాద్/రాయపోల్ : తెలంగాణ గురుకులాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం దౌల్తాబద్ ఎంజేపీ గురుకులంలో జరిగిన రాష్ట్ర స్ధాయి క్రీడోత్సవాల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో హాస్టళ్లలో చదువుకోవాలంటే విద్యార్థులు ఇబ్బందులు పడేవారన్నారు. స్వరాష్ట్రంలో గురుకుల పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేయడంతో విద్యార్థులు హాస్టళ్లలో చదివేందుకు పోటీ పడుతున్నారన్నారు. గురుకులాల విద్యార్థులు మంచిగా చదివి, రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడల్లో ప్రతీ విద్యార్థి రాణించాలని సూచించారు. గురుకులాల క్రీడాకారులు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమే రేపటి గెలుపునకు పునాదిగా భావించడమే క్రీడా స్ఫూర్తి అని చెప్పారు.