రైతు నేస్తం..


Fri,November 8, 2019 12:10 AM

-అన్నదాతలకు ఆపన్నహస్తం
-కలెక్టర్ హనుమంతరావుకు ప్రత్యేక అభినందనలు
-వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోల స్ఫూర్తి అభినందనీయం
-కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
-ఇతర జిల్లాల్లో అమలుకు చర్యలు
-సాగులో మూస పద్ధతికి స్వస్తి పలుకాలి
-సాగులో నూతన ఒరవడి సృష్టించాలి
-నమస్తే తెలంగాణ ప్రతినిధితో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరేలా చూడడంతో పాటు వినూత్న కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్న కలెక్టర్ హనుమంతరావును ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో చేపట్టిన రైతు నేస్తం అద్భుత కార్యక్రమం. సాగుబడిలో అన్నదాతకు ఈ కార్యక్రమం ఆపన్నహస్తం అందిస్తున్నది. వ్యవసాయశాఖ అధికారులు, ఏఈవోలు నేరుగా రైతుల పంట పొలాల వద్దకు వెళ్లి స్వయంగా పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. పంట సాగు, ఎరువుల వాడకం, మద్దతు ధర వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది స్ఫూర్తి అభినందనీయం. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో సమర్థవంతంగా చేపడుతున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని మెదక్ ఉమ్మడి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

జిల్లాలో మంచి కార్యక్రమం చేపడుతున్నారని, ఇతర శాఖలు ఆదర్శంగా తీసుకోవాలని హరీశ్‌రావు నమస్తే తెలంగాణ ప్రతినిధితో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించినప్పటికీ వారి నుంచి పనిచేయించుకోలేకపోయాం. కలెక్టర్ హనుమంతరావు చేపట్టిన రైతునేస్తంతో ఏఈవోలు అందరూ ప్రస్తుతం గ్రామాల్లోనే ఉంటున్నట్లు మీడియా ద్వారా తెలుస్తున్నది. రోజువారీగా 25 మంది రైతులను కలిసి వారికి ఇచ్చిన సలహాలు, సూచనలతో పాటు ఫొటోలను కోబో యాప్‌లో డౌన్‌లోడ్ చేయించడం బాగుందన్నారు. ఏఈవోలు కాకుండా నేరుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి నరసింహారావు కూడా పంట పొలాలు తిరుగుతున్నారు. ఆయనతో పాటు ఏడీఏ, ఏవోలు కూడా పొలం బాట పట్టి అన్నదాతలతో మాట్లాడుతున్నారు. ఇది మంచి కార్యక్రమం. పంటల సాగులో మెలకువలు తెలియక చాలా మంది రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర, ఎరువులు, పురుగు మందులను అధికంగా వాడుతూ నష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. పంటల బీమా చెల్లింపులపై కూడా రైతులకు సరైన అవగాహన ఉండడం లేదు.

రైతు నేస్తంతో ఇప్పుడు రైతులందరికీ అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం అందిస్తున్నారు. ఒక్క వ్యవసాయమే కాకుండా కూరగాయల సాగు, పశువుల పెంపకంపై కూడా అవగాహన కల్పిస్తున్నట్లు మీడియా ద్వారా తెలుసుకున్నాం. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన అధికారుల సమీక్షలో రైతుల కోసం మంచి కార్యక్రమం చేపడితే బాగుంటుందని తానే కలెక్టర్‌కు సూచించాను. చెప్పిన రెండు రోజులకే కలెక్టర్ అద్భుతమైన కార్యక్రమం మొదలుపెట్టారు. పంటల సాగు, ఇతర ఏ అంశంలో కూడా రైతులు నష్టపోవద్దనేదే ప్రభుత్వం ఉద్దేశం. రైతులను అన్ని విధాలుగా చైతన్యవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న కలెక్టర్‌తోపాటు జిల్లా వ్యవసాయ అధికారులకు ప్రత్యేక అభినందనలు. పంటను మార్కెట్‌కు తరలించడం, మద్దతు ధర పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి చెప్పాలి. జిల్లా రైతాంగం సాగులో నూతన ఒరవడి సృష్టిస్తుందని ఆశిస్తున్నానని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...