మున్సి‘పోల్స్‌' సందడి


Wed,November 6, 2019 01:17 AM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగనుండడంతో జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల సందడి నెలకొన్నది. ఇటీవలనే మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై దాఖలైన అన్ని రకాల పిటిషన్లను గతనెల 29న హైకోర్టు కొట్టివేసింది. సింగిల్‌ జడ్జి దగ్గర విచారణకు ఉన్న మున్సిపాలిటీలపై రేపోమాపో ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సుముఖంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని రెండు రోజుల కిందట వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా అధికార యంత్రాంగం మున్సిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండడంతో ఆయా వార్డుల్లో పోటీ చేసే ఆశావహులు తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీ మినహా అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించేందకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలో పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, వార్డుల విభజన, స్ట్రాంగ్‌ రూంల ఏర్పాటు తదితర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో “నమస్తే తెలంగాణ ప్రతినిధి” అందిస్తున్న ప్రత్యేక కథనం...

సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌, దుబ్బాకతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఉండడంతో మిగతా 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకు ముందే జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే ఈ మున్సిపాలిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన పూర్తి చేశారు. ఆయా మున్సిపాలిటీల్లోని వార్డుల వారిగా రిజర్వేషన్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు చేపట్టాల్సి ఉంది. రిజర్వేషన్ల కోసం ఆయా మున్సిపాలిటీల్లో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాలో మున్సిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు...
దుబ్బాక మున్సిపాలిటీలో మొత్తం 20,071 మంది ఓటర్లు ఉండగా వీరిలో 10,286 మంది మహిళా ఓటర్లు, 9,785 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని మొత్తం 20 వార్డులుగా విభజించారు. హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం 17,073 మంది ఓటర్లు ఉండగా వీరిలో 8,665 మంది మహిళా ఓటర్లు, 8,408 మంది పురుష ఓటర్లు ఉండగా మొత్తం 20 వార్డులు ఉన్నాయి. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, మున్సిపాలిటీలో మొత్తం 30,130 మంది ఓటర్లు ఉండగా వీరిలో 15,078 మంది మహిళా ఓటర్లు, 15,052 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని మొత్తం 20 వార్డులుగా విభజించారు. నూతనంగా ఏర్పాటైన చేర్యాల మున్సిపాలిటీలో మొత్తం 12,125 మంది ఓటర్లు ఉండగా వీరిలో 6,147 మంది మహిళా ఓటర్లు, 5,978 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని మొత్తం 12 వార్డులుగా విభజించారు. గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌లో 43 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అదనంగా మరో 2 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. హుస్నాబాద్‌లో 35, దుబ్బాకలో 41, చేర్యాలలో 24 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 143 పోలింగ్‌ కేంద్రాలు గుర్తించగా గజ్వేల్‌లో అదనంగా మరో రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించడంతో మొత్తం జిల్లాలో 145 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఈ బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించి ఐడెంటిఫై చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని నియమిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. వీరంతా ఎన్నికల నామినేషన్‌ స్వీకరణ నుంచి ఫలితాలు ప్రకటించేంత వరకు విధుల్లోనే ఉంటారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...