అర్హులకే డబుల్ ఇండ్లు


Sat,November 2, 2019 11:19 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పట్టణంలోని నర్సపురం శివారులో జీ+2 పద్ధతిలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించామని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా, వేగంగా చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సెలక్షన్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులతో డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గూడు లేని పేదలకు ఇండ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హల లేని వారిని గుర్తించాలన్నారు. పట్టణంలో 11,657 దరఖాస్తులు వచ్చాయని అధికారులు మంత్రి హరీశ్‌రావుకు వివరించగా, వారిలో నిజమైన లబ్ధిదారులకే ఇల్లు వచ్చేలా చూడాలన్నారు.

గతంలో ఆయా పథకాల ద్వారా ఇండ్లు పొందిన వారిని, ప్రభుత్వం ద్వారా ఇండ్ల స్థలాలు పొందిన వారిని గుర్తించాలన్నారు. సొంత స్థలాలు ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే, వారిని అనర్హుల జాబితాలో చేర్చాలన్నారు. దరఖాస్తుదారుల్లో ఎవరికి ఎంత భూమి ఉంది? గృహ రుణాలు తీసుకున్న వారు ఎంత మంది? ఆస్తి పన్ను కట్టేవారు.. ట్రేడ్ లైసెన్స్ ఉన్న పెద్ద వ్యాపారులను గుర్తించి తొలగించాలన్నారు. మున్సిపల్ పరిధిలో 50 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, దరఖాస్తు చేసుకున్న వారి పేరు విద్యుత్ కనెక్షన్‌లో ఉంటే వారికి ఇల్లు ఉన్నట్లుగా నిర్ధారించి, అనర్హులుగా గుర్తించాలన్నారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పేదలకే డబుల్ బెడ్‌రూం ఇండ్లు దక్కేలా చూడాలన్నారు.

సమగ్ర నివేదికను వినియోగించుకోవాలి
డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపు కోసం అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ రూపొందించిన సమగ్ర నివేదికను వినియోగించుకోవాలని ఎంపిక కమిటీ సభ్యులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రంలో 12 రకాల రికార్డులకు సంబంధించిన సమాచారంతో నిజమైన లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలో టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. సిద్దిపేట మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఈ సమాచారంతో బేరీజు వేసుకొని, ఎంపిక చేయాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని ఆదేశించారు. ఈ సమాచారంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రావణ్, చరణ్‌దాస్, విద్యుత్ ఎస్‌ఈ కరుణాకర్, డీఈ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...