సిద్దిపేట తరహాలో దుబ్బాక అభివృద్ధి


Fri,November 1, 2019 11:11 PM

-ప్రజలు స్వచ్ఛత పాటిస్తూ ప్లాస్టిక్‌ను నిరోధించాలి
-డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ దుబ్బాక పర్యటన
-డబుల్ ఇండ్లతోపాటు సీఎం చదివిన బడి ప్రారంభోత్సవం
-ఆర్థికమంత్రి హరీశ్‌రావు వెల్లడి
-పంటల మద్దతు ధర కోసం రూ.7వేల కోట్లు
-చిన్నకోడూరు ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో మంత్రి

దుబ్బాక టౌన్ : దేశంలో సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగ ఉందని, ప్రజలందరికీ పథకాలను అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నిం పేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదల కోసం పని చేస్తున్న ఈ ప్ర భుత్వానికి ప్రజల అండదండలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. దుబ్బాకలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపాలిటీ కి మంజూరైన ట్రాక్టర్లు, ఆటో రిక్షాలను అందజేసిన అనంతరం డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడారు. దుబ్బాక, సిద్దిపేట తనకు రెండు కండ్లలాంటివని, సిద్దిపేట తరహాలోనే దుబ్బాకను తీర్చిదిద్దుతామన్నారు. రూ.18 కోట్లతో వంద పడకల దవాఖాన, రూ.10 కోట్లతో సీఎం కేసీఆర్ చిన్ననాడు చదువుకున్న బడి నూతన నిర్మా ణం, వెయ్యి డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, అవి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.

డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ దుబ్బాకలో పర్యటిస్తారని, ఆయన చేతుల మీదుగా పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందజేయడంతో పాటు నూతన పాఠశాలను ప్రారంభిస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బీసీ కాలనీలో నిర్మిస్తున్న వెయ్యి డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇండ్లకు అవసరమైన తాగునీరు అందించేందుకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నామని, వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
దుబ్బాక పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా లచ్చపేటలో నిర్మించిన ఏడీఏ భవన నిర్మాణాన్ని ప్రారంభించిన మంత్రి, మారెమ్మ ఆలయం నుంచి దుంపలపల్లి రోడ్డును కలిపే బీటీ రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం వంద పడకల దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, దవాఖాన నిర్మాణం ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ అవసరాల కోసం రామసముద్రం చెరువు కట్ట సమీపంలో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. రూ. 2 కోట్లతో నిర్మించ తలపెట్టిన డిజిటల్ గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం దుంపలపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి, రూ. 10 కోట్లతో నిర్మించిన సీఎం కేసీఆర్ చిన్ననాడు చదివిన బడి నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రూ. 50 లక్షలతో మహిళా భవన నిర్మాణానికి మంత్రి నిధులను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో 36 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. కోటి 50లక్షల రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలతకిషన్‌రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, తహసీల్దార్ రాంచంద్రం, సబ్‌రిజిస్ట్రార్ జిల్లా అధికారి కేవీ రమేశ్‌రెడ్డి, డీఐజీ మధుసూదన్‌రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ కిశోర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ కరుణాకర్ బాబు, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి
దుబ్బాక టౌన్/మిరుదొడ్డి: గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక మండలం చౌదర్‌పల్లిలో యాదవ సంఘ, సుతారి కార్మిక సంఘ, శాలీవాహన కుమ్మరి సంఘ భవనాలకు శుక్రవారం శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అలాగే, గ్రామంలోని ప్రాథమికోన్నత, అంగన్‌వాడీ పాఠశాలలను సందర్శించగా, మంత్రికి విద్యార్థులు స్వాగతం పలికారు. మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్డు సైజు మరి చిన్నదిగా వస్తుందని మంత్రి సంబంధిత అధికారులను హెచ్చరించారు. వెంటనే చర్యలు తీసుకొని నాణ్యమైన భోజనంను విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామాల్లో ప్రగతి చైతన్యం వెల్లువిరుస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు ప్రజల సహకారం ఎంతో కీలకమన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాలని ఒక గ్రామ ప్రజలు మరో గ్రామంతో అభివృద్ధిలో పోటీపడాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్తపుష్పలత కిషన్‌రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ కనకయ్య, ఉప సర్పంచ్ అరుణ, మాజీ సర్పంచ్‌లు రామానుజం, బాల్‌రాజు, నాయకులు పాల్గొన్నారు.

దుబ్బరాజేశ్వర ఆలయంలో పూజలు..
చౌదర్‌పల్లి దుబ్బరాజేశ్వర ఆలయంలో మంత్రి హరీశ్‌రావు పూజలు చేశారు. ఆలయ పూజారులు దుబ్బరాజం పంతులు పూర్ణకుంభంతో మంత్రి, ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సోలిపేటకు తీర్థప్రసాదాలు అందజేసి, సన్మానించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...