పోలీసుల సేవలు అజరామరం


Mon,October 21, 2019 11:30 PM

-పోలీసు లేని సమాజం ఊహించలేం
-వారి త్యాగాలు వెలకట్టలేనివి
-కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
-పోలీసు అమరుల సంస్మరణ దినం
-నివాళులర్పించిన అధికారులు, పోలీసు కుటుంబాలు

సిద్దిపేట టౌన్: పోలీసుల సేవలు అజరామరమని వారి త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల దినం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానం ఆవరణలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీలు నర్సింహారెడ్డి, ప్రభాకర్, బాపురావు, మహ్మద్ రియాజ్ ఉల్‌హక్ పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. స్మృతి పరేడ్‌ను రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి ఎన్నో త్యాగాలను చేస్తూ ప్రజలకు రక్షణ కవచంగా పోలీసులు ఉంటారన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో నిరంతరం శ్రమిస్తారని చెప్పారు. 24 గంటలు విధులు నిర్వర్తిస్తూ వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని, సమాజంలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి క్షణం ప్రజల అవసరాల గురించి నిరంతరం పనిచేస్తూ ధన, మాన, ప్రాణ రక్షణ కోసం పాటుపడుతారని అన్నారు. అంతకు ముందు జిల్లాలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అమరుల కుటుంబ సభ్యులకు సన్మానించి మెమోంటో అందజేశారు.

ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అమరుల, పోలీసు కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పారు. అంతకు ముందు అడిషనల్ డీసీపీలు నర్సింహారెడ్డి, బాపురావులు మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో అమరులైన పోలీసులను స్మరించారు. అమరులైన పోలీసు జీవితాలను మార్గదర్శకంగా, ఆదర్శంగా మలుచుకుంటూ ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించినప్పుడే వారికి నిజమైన నివాళి అని చెప్పారు. త్యాగాలకు భయపడకుండా వెనుకడుగు వేయకుండా అసాంఘిక శక్తులతో పోరాడి విజయం సాధించే వారే పోలీసులని అన్నారు. పోలీసులు త్యాగం చేయని రోజంటూ ఉండదని, పండుగ పబ్బం, సెలవులు లేకుండా శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పనిచేస్తారన్నారు.

పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం
అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని కమిషనరేట్ పరిధిలో విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్, చిత్రలేఖన పోటీలు జరిపారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా విజేతలను ఈ సందర్భంగా ప్రకటించారు. నేనే పోలీసు అయితే అంశంపై రాష్ట్ర స్థాయిలో ఆన్‌లైన్‌లో జరిగిన వ్యాసరచన పోటీల్లో సిద్దిపేట జిల్లా గుండారం జడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న విద్యార్థి మణికంటేశ్వర మొదటి స్థానంలో నిలిచాడు. అదే విధంగా సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో జరిగిన వ్యాసరచన పోటీల్లో శ్రీజ, ప్రశాంత్, స్రవంతి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందారు. చిత్రలేఖనం పోటీల్లో సుబాని, సాయిచరణ్, వాసుదేవులు గెలుపొందారు. వీరికి కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సర్టిఫికెట్లను, మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీ రామేశ్వర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వన్‌టౌన్ సీఐ సైదులు, టూటౌన్ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, ఆర్‌ఐ గణేశ్‌కుమార్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...