అయ్యో.. బంగారు తల్లులూ


Mon,October 21, 2019 11:26 PM

తొగుట : విధి ఆ కుటుంబంపై కక్షకట్టింది. ఒకరి తర్వాత ఒకరిని బలిగొంటూ ఆ కుటుంబంలోని పిల్లలకు తీరని వేదనని మిగిల్చింది. ఈ కష్టం ఎవరికి రావొద్దు..పగోనికి కూడా రావొద్దు..విద్యా బుద్ధులు నేర్పించి, జీవితంలో అండగా ఉండాల్సిన తల్లి దండ్రులు అనారోగంతో మధ్యలోనే విడిచిపెట్టి వెళ్లిపోయారు..కొడుకు, కోడలు మరణించడంతో కడుపు కోతను దిగమింగి, వృద్ధాప్యంలో చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకున్న నానమ్మ కూడా విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు పోవడంతో ఆ చిన్నారులు రెక్కలు లేని పక్షుల్లా విలవిలలాడడంతో మండలంలోని బండారుపల్లి గ్రామం కన్నీరు మున్నీరైంది. పుస్తకాలు పట్టాల్సిన చిట్టిచేతులు..అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడంతో చూపరులకు సైతం కన్నీరు పెట్టించే విషాథ గాధ..వివరాల్లోకి వెళ్తే మండలంలోని బండారుపల్లికి చెందిన కుమ్మరి శ్రీనివాస్‌కు ఎలాంటి ఆస్తి పాస్తులు లేకపోవడంతో కూలీ పనులు చేస్తూ భార్య సుజాత, కుమార్తెలు వైష్ణవి, వాసవి, తల్లి ఐలవ్వలను పోషించుకునేవాడు. పచ్చగా సాగుతున్న వీరి సంసారంలో మాయదారి రోగం పెద్ద విషాదాన్నే మిగిల్చింది. గత రెండేండ్ల క్రితం తల్లి సుజాత, రెండు నెలల తర్వాత తండ్రి శ్రీనివాస్ మరణించడంతో చిన్నారుల విషాదానికి అంతు లేకుండా పోయింది. జీవిత చరమాంకంలో చివరి వరకు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడనుకున్న కొడుకుతో పాటు కోడలు కూడా మధ్యలోనే విడిచి వెళ్లిపోవడంతో శ్రీనివాస్ తల్లి ఐలవ్వ తల్లడిల్లిపోయింది.

ఒక వైపు వృద్ధాప్యం కబలిస్తున్నా మనుమరాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఎలాంటి ఆస్తి పాస్తులు లేకపోవడంతో సీఎం కేసీఆర్ చొరవతో పెంచిన పింఛన్ డబ్బులతో వారిని సాకుతూ వచ్చింది. ఈ సంవత్సరం వృద్ధాప్యం మూలంగా ఐలవ్వ తరచూ అనారోగ్యానికి గురవ్వడంతో మనుమరాళ్లను సాకడం కష్టంగా మారింది. కంటికి రెప్పలా చూసుకుంటున్న మనుమరాళ్లను ప్రేమను చంపుకొని అతి కష్టంమీద తొగుట కస్తూర్బా గురుకులంలో చేర్పించింది. వైష్ణవి 8వ తరగతి, వాసవి 6వ తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో ఆదివారం అనారోగ్యంతో ఐలవ్వ మరణించింది. తల్లి దండ్రుల తర్వాత పెద్ద దిక్కుగా ఉన్న నానమ్మ మరణంతో మనుమరాళ్లు తట్టుకోలేకపోయారు. తమకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోదించారు. వారి రోదన చూసి చూపరులు కంట తడిపెట్టారు. ఐలవ్వ అంత్యక్రియలకు వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో బంధువులు చందాలు వేసుకొని సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.

ముగ్గురికి అంత్యక్రియలు నిర్వహించిన వైష్ణవి..
పిల్లల బాగోగులు చూడాల్సిన తల్లి దండ్రులు మధ్యలోనే మరణించడం, ఏకైక దిక్కుగా ఉన్న నానమ్మ కూడా మరణించడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి పెద్ద దిక్కుకావడం తీరని విషాదమే. ముగ్గురి అంత్యక్రియలను వైష్ణవి ముందుండి నిర్వహిస్తుంటే చూపరులు కంటతడిపెట్టారు. పగోనికి కూడా ఈ కష్టం వొద్దని వారు బోరున విలపించారు. ఎప్పుడు కూలుతుందో తెలియని ఇల్లు తప్పితే ఆస్తి పాస్తులు లేని అనాథలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...