సేవకు సెల్యూట్


Sun,October 20, 2019 11:44 PM

-నేడు పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం
-జిల్లాలో విధి నిర్వహణలో 13మంది అమరులు
సిద్దిపేట టౌన్: దేశం కోసం చివరి రక్తం బొట్టు వరకు పోరాడి అసువులు బాసిన రోజు అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వారం పాటు అమరులను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలను జిల్లా పోలీసులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం.. విధి నిర్వహణలో జిల్లా వ్యాప్తంగా అసువులు బాసిన పోలీసులు.. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన కథనాన్ని నమస్తే తెలంగాణ అందిస్తున్నది.

పోలీసు అమరవీరుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం..
ప్రజా రక్షణ, దేశ రక్షణకు పోలీసులు కనబరిచిన స్పూర్తిదాయక పోరాటానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. 1959లో ఎస్‌ఐ కరీమ్‌సింగ్, 20 మంది జవాన్లు కలిసి లడక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొరబడి ఆర్మీ వారిపై దాడి చేసింది. మన వాళ్లు తక్కువగా ఉన్నప్పటికీ వారితో చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి 10 మంది పోలీసులు వీరమరణం పొందారు. వారిని స్మరిస్తూ 1960 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. వీరితో పాటు ఈ ఏడాది విధి నిర్వహణలో సుమారు 400 మంది పైచిలుకు మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు.

అమరవీరుల కుటుంబాల్లో తీరని దు:ఖం
కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన పోలీసులు అనతికాలంలోనే మనందరికీ దూరమయ్యారు. ప్రజల మన్ననలు పొందారు. జిల్లా వ్యాప్తంగా నక్సల్స్ స్పృష్టించిన అలజడి కొన్ని పోలీసు కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చింది. సిద్దిపేట జిల్లాలో సీఐతో పాటు ఇద్దరు ఎస్‌ఐలు, ఒక కానిస్టేబుల్, ఐదుగురు పంజాబ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఎన్నికల విధి నిర్వహణకు వచ్చిన నలుగురు కానిస్టేబుళ్లు ఇలా మొత్తం 13 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

వారం పాటు వారోత్సవాలు
పోలీసు అమరవీరులను స్మరిస్తూ సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహించారు. జిల్లాలోని అన్ని సర్కిళ్ల పరిధిలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు, రోజువారి దినచర్య, వినియోగిస్తున్న ఆయుధాల పనితీరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, పోలీసు స్టేషన్ల రైటర్ల విధులు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం పోటీలను జరిపారు. పోలీసు స్టేషన్లలో అమరులను స్మరిస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు.

నేడు డిగ్రీ కళాశాల మైదానంలో అమరుల దినోత్సవం
సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం పోలీసు అమరుల దినోత్సవాన్ని పోలీసు శాఖ నిర్వహిస్తున్నది. పోలీసు అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోనున్నారు. పోలీసు అమరవీరుల స్థూపానికి పోలీసులు నివాళి అర్పించి మౌనం పాటిస్తారు. అమర పోలీసు కుటుంబాలను సన్మానించి మెమోంటోలు అందజేస్తారు.

పోలీసుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిర్విరామంగా కృషి
శాంతిభద్రతల పరిరక్షణకు అనుక్షణం పాటుపడే పోలీసుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిర్విరామంగా కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎవరు కూడా పోలీసుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే దేశంలోనే తెలంగాణ పోలీసును అగ్రభాగాన నిలిపారు. నేరస్తులను పట్టుకునేందుకు ఆధునిక వాహనాలు అందించారు. అత్యాధునికమైన పోలీసు స్టేషన్లు నిర్మించారు. ప్రత్యేకంగా టీఎస్ కాప్ యాప్‌ను రూపొందించారు. హోంగార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు సముచిత గౌరవాన్ని కల్పించారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను ఇచ్చి అందరి మనసులను దోచుకున్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసును ఆదర్శంగా నిలిపారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...