ముంచెత్తిన వాన


Sat,October 19, 2019 11:27 PM

-జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు
-చెరువులు, కుంటల్లోకి భారీగా వరద
-మత్తడి పోస్తున్న చెక్‌డ్యాంలు
-గాలివానకు నేలకొరిగిన వరి, మొక్కజొన్న చేన్లు
-పత్తిచేన్లలో నిలిచిన నీళ్లు
-పిడుగుపాటుకు మూడు బర్రెలు మృతి
-పలుచోట్ల కూలిన ఇండ్లు, వంగిన కరెంటు స్తంభాలు
-జిల్లావ్యాప్తంగా 10 సెం.మీ వర్షపాతం నమోదు
మళ్లీ వర్షం ముంచెత్తింది.. నాలుగైదు రోజులుగా అడపాదడపా కురుస్తుండగా, శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీగా కురిసింది. భారీ శబ్దాలు, ఉరుములు, మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు చిన్నకోడూరు, సిద్దిపేట మండలంలో మూడు బర్రెలు మృతిచెంద డంతో వాటి యజమానులు లబోదిబో మంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వానతో చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. వానకాలంలో ఇప్పటివరకు నిండని చెరువుల్లో కూడా నీళ్లు చేరాయి. నంగునూరు మండలం అక్కెనపల్లి పెద్దవాగుపై నిర్మించిన 6 చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. మూడేళ్ల తరువాత పెద్దవాగు జలకళ సంతరించు కోవడంతో రైతులు సంబురపడు తున్నారు. మద్దూరు, తొగుట, మిరుదొడ్డి, కొండపాక మండలాల్లో చెక్‌డ్యాంలు మత్తడి పోస్తూ కనువిందు చేస్తున్నాయి. వాగులు ఉద్ధృతంగా పారుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. గాలివాన బీభత్సానికి వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న చేన్లు నేలకొరిగాయి. రేపోమాపో కోయాల్సిన వరి పూర్తిగా వంగిపోవడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. మొక్కజొన్న, పత్తిచేన్లకు అపార నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా రెండురోజుల్లోనే 10 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

చిన్నకోడూరు/నారాయణరావుపేట : ఉరుములు.. మెరుపులతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెక్‌డ్యాంలు, చెరువులు నిండుకుండలా మారాయి. చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాగు జలకళను సంతరించుకుంది. రామంచలో పిడుగుపడడంతో కుచ్చుల నారాయణ, కస్తూరిపల్లిలో బీనబోయిన యాదయ్యలకు చెం దిన పాడి గేదెలు మృతి చెందాయి. అలాగే, గంగాపూర్‌లో 50 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో మొక్కజొన్న, 80 ఎకరాల్లో పత్తి, విఠలాపూర్‌లో 40 ఎకరాల్లో వరి, 6 ఎకరాల్లో పత్తి, అల్లీపూర్‌లో 6 ఎకరాల్లో వరి, గోనెపల్లిలో 23 ఎకరాల్లో వరి, అనంతసాగర్‌లో 30 ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లింది. మొత్తంగా మండల వ్యాప్తంగా 187 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో మొక్కజొన్న, 82 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా. కాగా, గంగాపూర్‌లో పీఏసీఎస్ చైర్మన్ మూర్తి బాల్‌రెడ్డి, ఏఈవో లక్ష్మి, సర్పంచ్ లింగారెడ్డిలు పంటలను పరిశీలించారు.

నారాయణరావుపేట మండలంలో మాటిండ్ల నక్కవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం మత్తడి దుంకడంతో మాటిండ్ల, గోపులాపూర్, జక్కాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యాం వద్ద సర్పంచ్ కొంగరి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్యాలలోని తాళ్ల చెరువు మత్తడి దుకుతుంది. మండల వ్యాప్తంగా 95 ఎకరాల్లో వరి, 13 ఎకరాల్లో మొక్కజొన్న, 8 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. గుర్రాలగొందిలో 30 ఎకరాల్లో వరి, 7 ఎకరాల్లో మొక్కజొన్న, 5 ఎకరాల్లో పత్తి, మల్యాలలో 15 ఎకరాల్లో వరి, 5 ఎకరాల్లో మొక్కజొన్న, 8 ఎకరాల్లో పత్తి, మాటిండ్లలో 8 ఎకరాల్లో వరి, గోపులాపూర్ 18 ఎకరాల్లో వరి, జక్కాపూర్ గ్రామంలో 24 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.

చేతికి అందివచ్చిన వరి.. అందకుండా
మిరుదొడ్డి : మండలంలో మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. మొక్కజొన్న, పత్తి చేనుల్లో నీళ్లు నిలువడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా వర్షా లు కురువడంతో చేతి కందిన పంటలు నీటితో తడిసిపోయాయి. పత్త్తి చేన్లు నిత్యం కురిసే వర్షానికి ఎరుపు రంగులోకి మారి పత్తి నల్లగా మారిపోతున్నాయి.

హుస్నాబాద్ డివిజన్‌లో భారీగా..
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : డివిజన్‌లోని హు స్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మం డలాల్లో రాత్రి 10:30 గంటలకు ప్రారంభమైన వర్షం తెల్లవారుజాము వరకు కురిసింది. పట్టణంతోపాటు మం డలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిన్న చెరువులు, కుంటలు మత్తడి దూకాయి. హుస్నాబాద్‌లో పెద్ద చెరువైన ఎల్లమ్మ చెరువులోకి కొద్దిపాటి నీళ్లు చేరాయి. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు పాక్షికంగా దె బ్బతిన్నాయి. కుప్పపోసిన మక్కలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వరిపంట నేలకొరిగింది. చెరువులు, కుంటలు నిండాలని రైతులు ఆశిస్తున్నారు.

పొంగిపొర్లుతున్న వాగులు
చేర్యాల, నమస్తే తెలంగాణ : మండలంలోని వాగులు పొంగిపొర్లుతుండడంతోపాటు చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరుతుంది. తాడూరు గ్రా మానికి వెళ్లే లో-లెవల్ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో చేర్యాలకు శనివారం సాయంత్రం వరకు రా కపోకలు నిలిచాయి. అలాగే, ఆకునూరు వా గు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నాలుగో సారి ప్రవహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

మద్దూరు : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండంంలోని చెరువు, కుంటలు పొంగిపొర్లుతున్నా యి. అర్జున్‌పట్ల, కూటిగల్ నల్లచెరువు, లింగాపూర్, ధూ ళ్మిట్ట, జాలపల్లి చెక్‌డ్యాం మత్తడి పోస్తున్నాయి. కరువుతీర కురుస్తున్న వర్షాలతో యాసంగితోపాటు మరో పంట కు నీటి సమస్య ఉండదని రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, అకాల వర్షాలకు వివిధ గ్రామాల్లో వరి పంట నేలకొరగడంతో పాటు పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతింటున్నాయి. కాగా, అర్జున్‌పట్ల గ్రామానికి చెందిన తాళ్లపల్లి నర్సింహులుకు చెందిన పెంకుటిళ్లు కూలింది.

చెరువులు, కుంటలకు జలకళ
కొండపాక : మండలంలోని దాదాపు అన్ని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంది. మర్పడగ, దుద్దెడ, వెలికట్ట, జప్తి నాచారం, సిరిసనగండ్ల, కొండపాక, కుకునూరుపల్లి, మంగోల్, తిప్పారం గ్రామాలోని చెరువులు నిండాయి. రామునిపల్లి చెరువు అలుగు పారుతుంది. దుద్దెడలోని నల్లచెరువు, కుకునూరుపల్లిలోని కలకలమ్మ చెరువు, లక్ష్మి లాంటి పెద్ద చెరువులు నిండుకుండలా మా రాయి. మొక్కజొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లింది.

గంగమ్మతల్లికి పూజలు
నంగునూరు : మండలంలోని వాగులు, చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకుతుండడంతో రైతాంగంలో సంబురం నెలకొంది. అక్కెనపల్లి పెద్దవాగుపై నిర్మించిన 6 చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. అక్కెనపల్లి పెద్దవాగు 15 కి.మీ పొడవునా ఆకునూర్, లింగాపూర్, దూల్‌మిట్ట, తోర్నాల, ఖాత, ఘణపూర్, అక్కెనపల్లి మీదుగా బస్వాపూర్ సింగరాయ లొద్దుల్లోకి చేరుతుంది. చెక్‌డ్యాంల వద్ద రైతులు, ప్రజాప్రతినిధులు గంగమ్మతల్లికి పూజలు చేశారు.
కోహెడ : ఈదురు గాలులతో కూడిన వర్షానికి వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్షం పడుతుడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జోరుగా కూడవెల్లి ప్రవాహం..
తొగుట : మండలంలోని కూడవెల్లి ప్రవాహం జోరు గా సాగుతుంది. కూడవెల్లి వాగు నీళ్లు జప్తిలింగారెడ్డి ఫీడర్ చానల్ ద్వారా తుంగ చెరువుకు వెళ్తున్నాయి. భారీ వర్షాలకు ఆయా గ్రామాల్లో పత్తి , వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...