మల్లన్న ద్వారాలకు నూతన శోభ


Sat,October 19, 2019 11:25 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. జిల్లా కేంద్రంలో ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఆలయ ద్వారాలకు వెండి తొడుగులను బిగించాలని మంత్రులు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్వామి వారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న మిశ్రమ వెండిని కరిగించి స్వచ్ఛమైన వెండితో మల్లన్న ఆలయంలోని 6 ద్వారాలకు వెండి తొడుగులు తయారు చేసేందుకు అధికారులు అన్ని చర్యలు ప్రారంభించారు. స్వామి వారి ఆలయంలో ఉన్న మిశ్రమ వెండిని తూకం వేసి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లిలోని ప్రభుత్వ బంగారు, వెండి శుద్ధి కర్మాగారానికి తరలించి కరిగించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక కమిటీని ఇటీవల నియమించింది. దేవాదాయ జ్యూవెల్లరీ వెరిఫికేషన్ అధికారి అంజనీదేవి, పాత వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నర్సింహులు, మల్లన్న ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌లను కమిటీలో దేవాదాయ శాఖ నియమించింది.

మిశ్రమ వెండిని కరిగించేందుకు రంగం సిద్ధ్దం..
మల్లన్నకు మొక్కుల రూపంలో భక్తులు సమర్పించిన 7క్వింటాళ్ల 80 కిలోల మిశ్రమ వెండిని కరిగించి స్వచ్ఛమైన వెండిని వెలికితీసేందుకు దేవాదాయ శాఖ అధికారులు రంగం సిద్ధ్దం చేశారు. శనివారం కమిటీ సభ్యులు ఆలయ సిబ్బందితో కలిసి మిశ్రమ వెండిని తూకం వేసి, సంచులో భద్రపరిచారు. మొత్తం వెండి తూకం వేయడం పూర్తి కాగానే ఈ నెల 21 న హైదరాబాద్‌లోని చర్లపల్లిలో బంగారు, వెండి శుద్ధి కర్మాగారానికి తీసుకుపోనున్నారు. అనంతరం స్వామి వారి ఆలయంలోని ప్రధాన ద్వారం(గంగరేటు చెట్టు వద్ద) మొదలుకొని గర్భాలయం వరకు ఉన్న 6 ద్వారాలు, తలుపులకు వెండి తొడుగులు ఏర్పాటు చేయనున్నారు.

రూ.30లక్షలతో వెండి తొడుగులు..
మల్లన్న ఆలయంలోని ద్వారాలకు సుమారు రూ.30లక్షల వ్యయంతో వెండి తొడుగులు వేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఆలయ ద్వారాలకు వెండి తాపడం వేస్తే ఆలయం నూతన శోభ సంతరించుకోనుంది. డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే కల్యాణోత్సవం వరకు ద్వారాలకు వెండి తొడుగులు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...