ములుగు : వాహనదారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరేందుకు హెల్మెట్ తప్పనిసరిగా దరించాలని గజ్వేల్ ఏసీపీ నారాయణ అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని క్షీరసాగర్‌లో ఎంపీటీసీ కొన్యాల మమత ఆధ్వర్యంలో కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొన్యాల బాల్‌రెడ్డి సహకారంతో గ్రామంలోని వాహనదారులకు 400 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పొయిన బాధిత 3 కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా గజ్వేల్ ఏసీపీ నారాయణ హాజరై గ్రామస్తులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాటి నివారణకు ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలని కోరారు. అతివేగంతో, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలను నడుపవద్దని ఆయన సూచించారు. నూతన మోటర్ వాహన చట్టాల గురించి వివరించారు. ద్విచక్రవాహనం నడిపే ప్రతి వాహనదారుడు హెల్మెట్‌ను తప్పని సరిగా దరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్‌ను తప్పక పొందాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి తమ కుటంబాలను అనాథలుగా మిగిలిస్తున్నారని అన్నారు. అంతకు ముందు జానపద కళాకారులు రోడ్డు భద్రత నియమాలపై పాటల రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, ట్రాఫిక్ సీఐ నర్సింగరావు, స్థానిక ఎస్సై రాజేంద్రప్రసాద్, ఎస్సైలు సాయిరామ్, అనిల్‌కుమార్, విజయ్‌కుమార్, దళిత సంఘాల మండల అధ్యక్షుడు నల్ల శ్రీను, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.