గ్రామాలను అందంగా తీర్చిదిద్దుకుందాం


Thu,September 19, 2019 11:12 PM

దుబ్బాక టౌన్: సమిష్టి కృషితో పని చేసి గ్రామాలను అందంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకుందామని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లో భాగంగానే ఈ 30 రోజుల ప్రణాళికను అమలు పర్చుతున్నామని, ప్రణాళికను బాధ్యతగా, చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. గురువారం దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో దుబ్బాక, మిరుదొడ్డి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రణాళికపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, దీనికి జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి కలెక్టర్ హాజరై, మాట్లాడారు. మన గ్రామాభివృద్ధి కోసం మనమే పని చేయాలి.. అని అన్నారు. ప్రణాళికబద్దంగా ముందుకు సాగి, రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా నిలుపుకుందామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈజీఎస్ కింద 3900 పనులు మంజూరు చేసుకొని ముందున్నామన్నారు. 30 రోజుల ప్రణాళికకు అవసరమయ్యే నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు రూ.330కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో సుమారు 500మంది చొప్పున 15రోజుల పాటు చిత్తశుద్ధితో పని చేస్తే, గ్రామం అద్దంలా మారుతుందన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే 30 రోజుల ప్రణాళిక విజయవంతమవుతుందన్నారు. సర్పంచ్ సమక్షంలోనే అభివృద్ధి పనులు జరుగాలని, వార్డు సభ్యులు, ప్రజల సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ప్రణాళిక సమర్థవంతంగా అమలు కానీ గ్రామాల్లో తిరిగి జరిపిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. 30 రోజులు పూర్తి కాగానే గ్రామాల వారీగా నివేదికలు తెప్పించుకొని, సమర్థవంతంగా ప్రణాళికను అమలు చేయని గ్రామాల్లో కేటగిరి-2 కింద మరో 15 రోజులపాటు పనులు జరిపిస్తామన్నారు. సర్పంచ్‌లకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు తాను అందుబాటులో ఉంటానన్నారు. జిల్లాలోని కొత్త పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిళ్లకు లోను కావద్దని, వారి వెంట తాముంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. సమస్య వస్తే పైఅధికారులను గానీ, సీనియర్లను గానీ అడిగి తెలుసుకోవాలని సూచించారు. త్వరలోనే కార్యదర్శులకు శిక్షణ కూడా ఇస్తామన్నారు.

ఆరోగ్య గ్రామాలకు అవకాశం : జడ్పీ చైర్‌పర్సన్
ఆరోగ్య, హరితగ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు సీఎం కేసీఆర్ మంచి అవకాశం కల్పించారని జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ పేర్కొన్నారు. గ్రామాల్లోని మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేసి అభివృద్ధిలో పోటీపడాలన్నారు. ముఖ్యంగా ఇంటి పరిశుభ్రతలో మహిళల పాత్ర కీలకమైందన్నారు. 30 రోజుల ప్రణాళిక అమలుకు నిధుల కొరత లేదని రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్ది సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ పద్మాకర్, డీపీవో సురేశ్‌బాబు, డీఆర్‌డీవో పీడీ గోపాల్‌రావు, ఎంపీపీలు పుష్పలత, సాయిలు, జడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, లక్ష్మీ, ఎంపీడీవోలు భాస్కరశర్మ, సుధాకర్‌రావు, దుబ్బాక మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ అమ్మన రవీందర్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, వివిధ శాఖల అధికారులు, గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ సందేహాలను కలెక్టర్‌తో నివృత్తి చేసుకున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...