పోలీసులు ప్రజలకు జవాబుదారులు ఉండాలి


Mon,September 16, 2019 11:53 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: పోలీసులు ప్రజలకు జవాబుదారులుగా పనిచేయాలని సిద్దిపేట కమిషనర్ జోయెల్ డెవీస్ అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే నేరాలను అదుపులో ఉంచడమే కాకుండా సమాజం శాంతియుతంగా ఉంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. సోమవారం సాయంత్రం హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న తీరుతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసులను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించి చట్టపరంగా తక్షణమే సమస్య పరిష్కరించాలన్నారు. ఫిర్యాదు తీసుకునేటప్పుడే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకోసం జరిగిందనే వివరాలను తప్పనిసరిగా తీసుకోవాల్సిన బాధ్యత రిసెప్షనిస్ట్‌దేనన్నారు. ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్ చేయాలన్నారు. నేరాల పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని కేసులు సత్వరంగా పరిష్కారం అయ్యేలా పోలీసు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. క్రమశిక్షణ, సమయపాలన ఉన్న పోలీసు అధికారులకు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో యూనిఫాం ధరించి ఉండాలని, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోలింగ్, బ్లూకోడ్స్ కోసం కేటాయించిన వాహనాలు ఏ సమయంలో ఎక్కడ ఉన్నాయో, ఏ పనిలో ఉన్నాయో రికార్డులో నమోదు చేయాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ పనిలో భాగంగా ప్రతి రోజు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పోలీసులు ముందుండి పనిచేయాలన్నారు. 5ఎస్ విధానాన్ని నిత్యం అనుసరించడంతో పాటు డయల్ 100కు వెంటనే స్పందించాలని సూచించారు. గ్రామ స్థాయిలో పనిచేసే వీపీవోలు గ్రామస్తులతో మమేకమై గ్రామంలోని విషయాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. పోలీసు సిబ్బందికి ఏ సమస్య ఉన్నా వెంటనే తనకు చెప్పాలన్నారు. అధికారులు, సిబ్బంది పనితీరును బట్టి ప్రతి నెలా రివార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ ఎస్ మహేందర్, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ దాస సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...