పింఛన్ల పండుగ


Sat,July 20, 2019 12:02 AM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పెన్షన్ లబ్ధిదారులకు నేటి నుంచి ప్రొసీడింగ్ కాపీతో పాటు మిఠాయిలను అందించి, పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జేసీ పద్మాకర్, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, జడ్పీ సీఈవో శ్రావణ్‌తో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ పెన్షన్లు రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు గ్రామ సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల భాగస్వామ్యంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎంపీడీలను ఆదేశించారు. ప్రతి అర్హుడికి పింఛన్ ప్రొసీడింగ్ కాపీ, మిఠాయిని స్థానిక ప్రజాప్రతినిధులతో అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సంబంధిత మండల స్థాయి, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ పాల్గొంటారని, ప్రొసీడింగ్స్ అందజేసేందుకు కావాల్సిన సభా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరపున అధికారిక బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో, మండల ప్రత్యేక అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వృద్ధ, వితంతు, బీడీ కార్మికులు, గీత, నేత, ఒంటరి, బోదకాలు, హెచ్‌ఐవీ బాధితులకు ఇస్తున్న పింఛన్‌ను రెట్టింపు చేయడం జరిగిందని చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.2016, వికలాంగులకు రూ. 3016 పెన్షన్ అందనుందని వివరించారు. ప్రొసిడింగ్ కాపీల పంపిణీ ముగిసిన తరువాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డితో పాటు ఆయా మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...