వైద్య సేవలు భేష్


Thu,July 18, 2019 03:19 AM

తూప్రాన్, నమస్తేతెలంగాణ : వైద్య ఆరోగ్య రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అడిషనల్ మిషన్ డైరెక్టర్ తమీమ్ అన్సారియా అనే ఐఏఎస్ అధికారి అన్సారియా అన్నారు. రాష్ట్రంలో అందుతున్న వైద్య సేవల తీరు బాగుందని, ఇక్కడ అందిస్తున్న సేవలు ఆదర్శవంతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఇటువంటి వైద్య సేవల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇక్కడ అధ్యయనం చేసేందుకు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. తూప్రాన్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించి రోగులకు అందుతున్న వైద్య పనితీరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగితెలుసుకున్నారు. సౌకర్యాలు సౌలభ్యంగా ఉన్నాయా అని ఆరా తీశారు. దవాఖానలో ఉన్న రోగుల సంఖ్యను పరిశీలించిన అనంతరం వయో వృద్ధుల సంరక్షణ కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలతో పాటు మహిళా విభాగం, ఓపీ సేవల కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాతాశిశు సంక్షేమ సంరక్షణ, వయో వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, పాలిటీవ్ కేర్ కేంద్రాల పనితీరు బాగుందని వాటి వైద్య సేవలను పరిశీలించేందుకు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు. కేసీఆర్ కిట్‌ల పంపిణీ వంటి పథకాలు ఆదర్శవంతమని చెప్పారు.

అంతకుముందు సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లోని రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించామని, ఆ తర్వాత గజ్వేల్‌లో జిల్లా దవాఖానను సందర్శించామన్నారు. అక్కడ హైడిపెండెంట్ సీ యూనిట్, డయాలసిస్ సెంటర్లను పరిశీలించి అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వర్గల్ మండలంలోని నాచారం గ్రామంలో క్యాన్సర్ వ్యాధి గ్రస్తురాలైన ఓ వృద్ధురాలితో పాటు తూప్రాన్ పట్టణంలోని పోతరాజుపల్లి గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వృద్ధుడి ఇంటికివెళ్లి అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి వారితో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అడిగితెలుసుకున్నట్లు వివరించారు. ఆమె వెంట జిల్లా సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ జగన్నాథరెడ్డి, తూప్రాన్ దవాఖాన సూపరింటెండెంట్ అమర్‌సింగ్‌లున్నారు. దవాఖాన వైద్య బృందంతో కూడా మాట్లాడి వైద్య సేవలపై అడిగితెలుసుకున్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...