కష్టాలకు ఎదురొడ్డి.. విజయం సాధించి


Tue,July 16, 2019 03:40 AM

సిద్దిపేట టౌన్: జీవితంలో ఏం సాధించాలన్నా లక్ష్యం ముఖ్యం. కృషి పట్టుదల తపన ప్రతిభ ఉంటే నిర్దేశించుకున్న లక్ష్యం చిన్నదవుతుంది. ఈ మాటలన్నీ మోయ్య తేజస్వీ ప్రియదర్శినికి వర్తిస్తాయి. తల్లిదండ్రుల కలకు అనుగుణంగా చదివి ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికైంది. గెస్ట్ లెక్చరర్‌గా ఎంపికై కన్నవారి కలను నెరవేర్చి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేటకు చెందిన ప్రియదర్శిని తండ్రి ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తూ ఇద్దరు కూతుర్లను ఉన్నతంగా చదివించాడు. చిన్న కూతురు తేజస్వీ ప్రియదర్శిని స్థానిక డిగ్రీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మె స్సీ ప్లానెట్ అండ్ బయాలజీ బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. జీవిత లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ అవ్వాలని నిర్దేశించుకుని గెస్ట్ లెక్చరర్ గాను చేసింది. ఈ క్రమంలోనే పోటీ పరీక్షల్లోను ప్రతిభ చాటింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి విడుదల చేసిన ఎస్‌ఐ ఉద్యోగ భర్తీలో సివిల్ ఎస్‌ఐగా ఎంపికైంది.

లక్ష్యాన్ని జయించిన రైతుబిడ్డ...
చిన్నకోడూరు: పట్టుదలతో చదివి లక్ష్యాన్ని జయించిన రైతుబిడ్డ మండల కేంద్రమైన నారాయణరావుపేటకు చెందిన జీకురు వెంకటేశం, వెంకటలక్ష్మిల కూతురు జీకురు జ్యోతి. చిన్నతనంలోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించింది. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి బీఈడీ చదువుతుండగానే ఎస్‌ఐ ఉద్యోగానికి సిద్ధమైంది. అప్పట్లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. మళ్లీ 2018లో ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కసితో చదివి గతంలో అర్హత సాధించలేకపోయాననే దానిని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు సిద్ధమైంది. సిద్దిపేట పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా శిబిరంలో చేరి పట్టు సాధించారు. ఇటీవల వెలువడ్డ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎస్‌ఐ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నది. ఇటీవలే జీకురు జ్యోతికి నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన కొబ్బరిచెట్టు కనకరాజుతో వివాహమైంది. కాగా భర్త కనకరాజు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.

నాన్న మాటలే గెలుపుకు దోహదపడ్డాయి..
చిన్నకోడూరు : బిడ్డా మనం పడ్డ కష్టం ఎప్పుడు వృథా పోదు.. నువ్వు చదువు మీద ఎట్ల కష్టపడుతున్నావో ఫలితం ఉంటదని మా నాన్న నాకు ఎప్పుడు ధైర్యం చెప్పి ముందుకు వెళ్లాలని సూచించే వాడని.. గంగరబోయిన నవీన్ నమస్తే తెలంగాణతో అన్నాడు. చిన్నకోడూరు మండలం రామంచ మధిర గ్రామం గంగరబోయిన కాలనీకి చెందిన గంగరబోయిన వెంకటలక్ష్మి రాములు చిన్నకోడూరు నవీన్ ఇటీవల వెలువడ్డ ఎస్‌ఐ పరీక్షా ఫలితాల్లో అర్హత సాధించాడు. నవీన్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసించాడు. సిద్దిపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో 2018లో డిగ్రీ పూర్తి చేశాడు. వెంటనే ప్రభుత్వం ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేయగా, కష్ట ఫలితంగా ఇటీవల వెలువడిన ఎస్‌ఐ ఫలితాల్లో ఆర్‌ఎస్‌ఐగా ఉద్యోగాన్ని సాధించాడు. ఒకటే సారి ఎస్‌ఐ ఉద్యోగానికి అర్హత సాధించడం సంతోషంగా ఉంది. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తానని నవీన్ తెలిపాడు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...