ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట


Wed,June 19, 2019 11:29 PM

మద్దూరు: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మంద మాధవి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆసరా ఫించన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్‌తో పాటు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు రక్షిత నీటిని అందిస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ అధికారాలతో పాటు తమ బాధ్యతలను గుర్తించి ప్రజలకు సేవలను అందించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడం ద్వారానే ప్రజాప్రతినిధులకు గుర్తింపు లభిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా ఎన్నో వ్యయప్రాయాసలను భరించి ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందిస్తుందని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం వల్ల భవిష్యత్ తరాలకు నీటి కొరత ఉండదన్నారు. కాగా గ్రామీణ నీటి సరఫరా అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు.

సమస్యల ఏకరువు..
మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. నాలుగు శాఖల పనితీరుపై మండల సభ చర్చించగా ఆయా శాఖల అధికారుల పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. ప్రధానంగా రైతుబంధు పథకం కింద రెండో విడుతలో కొంతమంది రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని మద్దూరు సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి, బెక్కల్ ఎంపీటీసీ నలుగొప్పుల రేణుక ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. అదేవిధంగా రైతుబీమా బాండ్లను రైతులకు అందించడం లేదని ఎంపీటీసీలు సూర్న ఐలయ్య, సుందరగిరి పరుశరాములు విమర్శించారు. పౌరసరఫరా, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అధికారులు సభకు గైర్హాజరు కావడంతో మండల సభ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి సభకు సంబంధిత అధికారులు గైర్హాజరు అవుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. ఉపాధిహామీ శాఖలో భాగంగా మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో మరుగుదొడ్లు, మోడల్ స్కూల్‌లో వంట గదుల నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ జనార్దన్‌రెడ్డి కోరారు.

మర్మాములలో అసంపూర్తిగా ఉన్న శ్మశానవాటిక నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఎంపీటీసీ సుందరగిరి పరుశరాములు అన్నారు. నర్సాయపల్లిలో పెండింగ్‌లో ఉన్న ఇంకుడుగుంతల నిర్మాణాలను పూర్తి చేయాలని సర్పంచ్ బద్దిపడిగె లలిత కోరారు. గాగిళ్లాపూర్‌లోని వడ్డెర కాలనీలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టాలని సర్పంచ్ బొల్లు కృష్ణవేణి కోరారు. వంగపల్లి, ధర్మారం గ్రామాల్లో నూతనంగా మిషన్‌భగీరథ వాటర్‌ట్యాంకులను నిర్మించాలని సర్పంచ్‌లు ఊట్ల రవీందర్‌రెడ్డి, గంగి భాగ్యలక్ష్మిలు కోరారు. అనంతరం పదవీకాలం పూర్తికానున్న ఎంపీపీ మంద మాధవి, జడ్పీటీసీ నాచగోని పద్మ, వైస్‌ఎంపీపీ చల్లా లక్ష్మినర్సింహారెడ్డి ఎంపీటీసీలను మండల పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఎంపీపీ, వైస్‌ఎంపీపీగా నూతనంగా ఎన్నికైన బద్దిపడిగె కృష్ణారెడ్డి, మలిపెద్ది సుమలతలను మండల పరిషత్ పాలకవర్గ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసవర్మ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...