66,827 మెట్రిక్‌ టన్నులు


Sun,June 16, 2019 12:20 AM

-యాసంగిలో భారీగా ధాన్యం సేకరణ
-జిల్లాలో 21,913మంది రైతులు నుంచి ధాన్యం కొనుగోళ్లు
-సివిల్‌ సప్లయ్‌ ద్వారా రూ.93.80 కోట్ల చెల్లింపులు
-ప్రతి ధాన్యపు గింజను కొన్న సర్కారు
-గతేడాదికంటే ఈ సారి తగ్గిన దిగుబడులు
-వానకాలంపైనే అన్నదాతల ఆశలు
హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ : యాసంగి పంటలు అంటేనే చేతికొచ్చే వరకు నమ్మకం ఉండని పరిస్థితి..చేతికొచ్చిన పంట మార్కెట్‌కు తీసుకెళ్లి కాంటా వేసి డబ్బులు చేతికొచ్చే వరకు రైతులు వరణుడిపైనే భారం వేసి ఉండాల్సిన దయనీయ స్థితి.. అంతే కాకుండా చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర రావడం, ధర వచ్చినా సమయానికి డబ్బులు చేతికందేవరకు నమ్మకం ఉండక పోవడం... తడిసిన ధాన్యాన్ని కూడా పట్టించుకోక పోవడం... మార్కెట్‌కు వచ్చే రైతులకు సరైన సౌకర్యాలు లేకపోవడం తదితర సమస్యలు కూడా రైతును ఉక్కిరిబిక్కిరి చేసేవి. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నది. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకునే సౌకర్యాలను కల్పిస్తూ వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యతినిస్తున్నది. దీంతో గడిచిన ఐదేండ్లలో రైతులు రెట్టింపు ఉత్సాహంతో ఎవుసం చేసేందుకు ముందుకొస్తున్నారు.

గత వానకాలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో యాసంగి సీజన్‌లో రైతులు వరితో పాటు ఇతర పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ముఖ్యంగా వరిధాన్యం దిగుబడి గత యాసంగి కంటే ఈ సీజన్‌లో భారీగా తగ్గింది. అయినా జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేశారు. సివిల్‌ సప్లయ్‌ శాఖ ఆధ్వర్యంలో వివిధ ఏజెన్సీలను ద్వారా ధాన్యం సేకరణ చేశారు. జిల్లా, మండల స్థాయి అధికారుల కృషితో యాసంగి సీజన్‌లో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించుకొని డబ్బులు కూడా తీసుకున్నారు. రైతులకు పెట్టుబడికి డబ్బులు ఇవ్వడంతో పాటు పండించిన ప్రతి ధాన్యపు గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

66,827మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు...
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 66,827 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సివిల్‌ సప్లయ్‌ శాఖ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేశారు. మొత్తం 21,913 మంది రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. గతేడాది యాసంగి సీజన్‌లో 1,10,838 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ సీజన్‌లో కేవలం 66,827 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఇందుకు కారణం వానకాలం సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురవక పోవడం, జిల్లాలో అత్యధికంగా వరిపండించే హుస్నాబాద్‌, అక్కన్నపేట, మద్దూరు మండలాల్లో పంట చేతికొచ్చే దశలో వడగండ్ల వానలు పడడం ముఖ్య కారణంగా చెప్పొచ్చు. పంట చివరి దశలో నీరందక కొంతమేర వరి ఎండిపోగా, ఆరుగాలం కష్టపడి వరుస తడులు పెట్టి కాపాడుకున్న పంటను చేతికందే దశలో వండగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. గతేడాకంటే ఈసారి 44,011 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గింది. గత యాసంగి సీజన్‌లో 26,065 మంది రైతులు ధాన్యం పండించి విక్రయించుకోగా ఈ సీజన్‌లో 21,913మంది రైతులు మాత్రమే వరిపంటను సాగుచేశారు. అంటే సాగునీటి సౌకర్యం తక్కువగా ఉండడం వల్ల ఈ యాసంగి సీజన్‌లో 4,152 మంది రైతులు వరిని సాగు చేయలేకపోయారు.

జిల్లాలో 161ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు...
జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వివిధ ఏజెన్సీలతో కలిసి మొత్తం 161 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి ధాన్యం విక్రయించుకొని ఇబ్బందులు పడకుండా రైతులకు అందుబాటులో ఉండేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా మండలాల్లోని సహకార సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 107, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 34,240 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల ద్వారా 32,587 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచారు. వడగండ్ల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం మిల్లర్లను ఒప్పించి కొనుగోలు చేయించారు. అలాగే ప్రతి కొనుగోలు కేంద్రాన్ని జియోట్యాగింగ్‌ చేయడం ద్వారా జిల్లా స్థాయి అధికారులు కొనుగోళ్లను ఆన్‌లైన్‌లో కూడా పరిశీలించేందుకు అవకాశం కల్పించారు.

రైతులకు రూ.93.80కోట్ల చెల్లింపులు...
జిల్లాలోని రైతులకు ఈ యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు చేసిన సివిల్‌ సప్లయ్‌ శాఖ వారు ఇప్పటి వరకు రూ.93.80కోట్ల చెల్లింపు చేశారు. కొనుగోలుచేసిన మొత్తం ధాన్యానికి 118.28 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇంకా రూ.24.48 కోట్ల చెల్లింపులు త్వరలోనే చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవికూడా రైతుల బ్యాంకు ఖాతాలు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన రెండు, మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా రెవెన్యూ అధికారుల ద్వారా భూమి వివరాలను కూడా అందుబాటులో ఉంచుకొని ఏ రైతుకు ఎంత భూమి ఉంది, ఎంత పంట పండిచ్చొచ్చనే అంచనాలు వేశారు. కొందరు దళారులు రైతులను అడ్డుపెట్టుకొని అక్రమ వ్యాపారం చేయకుండా అడ్డుకున్నారు.

ఈ సీజన్‌ పైనే రైతుల ఆశలు...
అతివృష్టి, అనావృష్టిలతో నిత్యం సతమతం అయ్యే జిల్లా రైతులు ఈ వానకాలంలోనైనా సరైన వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయనే ఆశాభావంతో ఉన్నారు. మే చివరి వారం రోహిణి కార్తెతో మొదలైన వానకాలం రైతులకు ఎంతవరకు మేలు చేస్తుందో వేచి చూడాలి. ఇటీవల కురిసిన వర్షానికి రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరొక భారీ వర్షం పడిందంటే విత్తనాలు వేస్తారు. కాగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు సైతం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విత్తన డీలర్లతో సమావేశాలు నిర్వహించి నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇటు ప్రభుత్వ సహకారం, అటు వరణుడి కరుణతో ఈ వానకాలం సీజన్‌లో రైతులు విరివిగా పంటలు పండించి ఆర్థికంగా వృద్ధిని సాధించాలని ఆశిద్దాం.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...