వామ్మో జూన్


Tue,June 11, 2019 11:36 PM

-తల్లిదండ్రుల్లో వణుకు
-పెరుగుతున్న ప్రైవేటు ఫీజులు
-తడిసి మోపెడవుతున్న భారం
-ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
సిద్దిపేట టౌన్ : పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు పడే ఆత్రుత అంతా ఇంతా కాదు.. తమలాగా తమ పిల్లలు కాకుండా ఉన్నత స్థానంలో ఉండాలని గొప్పగా ఆకాంక్షిస్తారు. చిన్నారుల అక్షరాభ్యాసం మొదలుకొని వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని కలలు కంటారు. ఎంత కష్టమొచ్చిన వారిని చదివించేందుకు తపన పడుతారు.. ఒక పూట పస్తులుండైనా వారిని చదివిస్తారు. సంవత్సర కాలంలో 11 నెలల్లో ఖర్చు ఎంత అవుతుందో కేవలం జూన్ మాసంలో అందుకు సమానంగా ఖర్చు ఉంటుంది. పాఠశాలలు ప్రారం భం అవుతుండడంతో పిల్లల తల్లిదండ్రులు ఖర్చుకు వణికిపోతున్నారు. మధ్య తరగతి తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు ముందుగానే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తారు. జూన్ మాసం వస్తుందని తెలిసి నాలుగు నెలల నుంచే కుటుంబ ఖర్చులను ఆదా చేస్తూ వస్తారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలు బలోపేతమయ్యాయి.

ప్రైవేట్ పాఠశాలల ఆధిపత్య ధోరణి చలామణి అవుతున్నది. ఆ ప్రభావం ఇప్పటికీ కొంత సగటు జీవిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు, మైనార్టీ రెసిడెన్షియల్, ఆదర్శ పాఠశాలలను నెలకొల్పారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు, డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. దశలవారీగా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వారి సంఖ్య తగ్గించే విధంగా కృషి చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు బ్యాగులు, యూనిఫామ్స్, పుస్తకాలు తదితర సామగ్రి కొనుగోలు చేస్తూ తల్లిదండ్రులు బిజీగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ మాసంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలతో నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం..

తల్లిదండ్రులపై భారం
బిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని దృఢసంకల్పంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి చదువు కోసం నానా కష్టాలు పడుతున్నారు. ముందుగా కుటుంబ ఖర్చులను ఆదా చేసుకొని వారిని చదివించేందుకు పాటుపడుతున్నారు. కాయకష్టం చేసుకునే కూలీలు, మధ్య తరగతి కుటుంబీకులు తెలిసి తెలియకో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తే వారి నుంచి పాఠశాలల యజమాన్యాలు ముక్కు పిండి వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. కొత్త యూనిఫామ్స్, నోట్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్ కొనుగోలు చేసేందుకు బాగానే ఖర్చు చేస్తున్నారు. కొందరు విద్యార్థులు గ్రామాలను వదిలి జిల్లా కేం ద్రం సిద్దిపేటకు వచ్చి కిరాయికి ఉంటూ చదువుకుంటున్నారు. మరికొందరు ఉన్న ఊరును, కన్న తల్లిదండ్రులను వదిలి వలస వస్తున్నారు. ఇలా అన్ని విధాలా తల్లిదండ్రులపై పిల్లలను చదివించేందుకు తమ భుజస్కంధాలపై భారాన్ని వేసుకుంటున్నారు.

ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాపారం
ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి ఏడాదికి ఫీజులు పెరుగుతున్నాయి. దీన్ని భరించడానికి సామాన్యులు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 250 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. తమ పాఠశాలలో సకల సౌకర్యాలు, ఆధునీక వసతులు, కంప్యూటర్ శిక్షణ, డిజిటల్ తరగతులు, ప్రత్యేక తరగతులు ఉన్నాయని సొంత డబ్బా కొట్టుకుంటూ తల్లిదండ్రుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రూ.5 వేల నుంచి 13వేల వరకు, 6నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రూ.6వేల నుంచి 25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అదనంగా స్కూల్ బస్సు చార్జీలను, అడ్మిషన్ ఫీజులను తీసుకుంటున్నారు. ఇక పాఠశాలల యూనిఫామ్స్, బ్యాడ్జీలు, టైబెల్టులు, బ్యాగులు, నోట్‌పుస్తకాలు తదితర వాటిని పాఠశాలల యజమాన్యాలు సూచించిన బుక్‌డిపోల్లోనే కొనుగోలు చేయిస్తూ పిల్లల తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్నారు.

తొలిగిపోతున్న అపోహలు
ప్రైవేట్ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అనే నానుడిని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఆ అపోహను తుడిచిపెట్టింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గత 6 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే లెక్కలేనన్ని గురుకుల, మైనార్టీ, ఆదర్శ, బీసీ వెల్ఫేర్ తదితర పాఠశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఇంగ్లిష్ మీడియం పాఠాలు, డిజిటల్ తరగతులను బోధిస్తున్నారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఉచిత బస్సు పాసులు, హాస్టల్ వసతి తదితర సౌకర్యాలెన్నో కల్పిస్తున్నది. ఏ మాత్రం ప్రైవేట్‌కు తీసిపోని విధంగా దినదిన ప్రవర్తమానంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను పూర్తిగా తొలగిస్తూ నూతన విద్యా విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

నేడు పాఠశాలలు పునఃప్రారంభం
ఆట పాటలతో సరదాగా రెండు నెలల పాటు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు ఇక బడిబాట పట్టే సమయం రానే వచ్చింది. పుస్తకాలతో కుస్తీ పట్టే రోజు నేటి నుంచి మొదలు కానున్నది. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించేందుకు ఇప్పటికే పుస్తకాలు అందుబాటులో ఉంచింది. బడిబాట కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాల్లో ఉపాధ్యాయులు ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నది.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...