పాస్‌పుస్తకాలున్న అందరికీ రైతుబంధు


Sat,May 25, 2019 11:45 PM

-మే 31లోగా రైతుల ఖాతాల్లోకి సాయం
-మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
-వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
-ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశం
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సిద్దిపేట నియోజకవర్గంలో రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంటకు పెట్టుబడి సాయం కోసం నిధులు మంజూరయ్యాయని, ఈ నెల 28న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని ఆయన నివాసంలో రైతుబంధు, ఎరువులు, విత్తనాల పంపిణీపై వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 4600 మంది లబ్ధిదారులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున మే 31లోగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయన్నారు. మండలాల వారీగా ఈ నెల 28న రైతుబంధు పెట్టుబడి సాయం పత్రాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలో 1600మంది రైతులు, చిన్నకోడూరులో 1600, నంగునూరులో 500, సిద్దిపేట రూరల్‌లో 871 మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుందని, తానే స్వయంగా మంజూరు పత్రాలు పంపిణీ చేస్తానని తెలిపారు.

అందుబాటులో ఎరువులు, విత్తనాలు
వానకాలంలో రైతులు వేసే పంటలకు అవసరమగు విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. రైతులకు వర్షాధార పంటలకు అవసరమయ్యే వరి, మొక్కజొన్న, పత్తి, కందులు, పెసర్లు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వరి పంట వేసే వారికి వరి విత్తనాలు 7500 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని కిలోకు రూ.5 చొప్పున విత్తనాలు, మొక్కజొన్న 35శాతం సబ్సిడీతో 60 వేల క్వింటాళ్ల విత్తనాలు రైతులు వేసే కావేరి, సీబీ 81,82 అందుబాటులో ఉన్నాయన్నారు. కందులు 580 క్వింటాళ్లు, పెసర్లు 40 క్వింటాళ్లు అందుబాటులో ఉండగా 65 శాతం సబ్సిడీతో ప్రతి ఆగ్రోస్ సెంటర్‌లో విత్తనాలు లభిస్తాయన్నారు. అదే విధంగా పత్తి 2లక్షల ఎకరాల సాగు కోసం ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అందుకు పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతులు వేసే 18కంపెనీలు అం దుబాటులో ఉండగా అందులో మైకో, కావేరి, రాశి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులను అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించాలని చెప్పారు. రైతులు అందుబాటులో ఉన్న విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వెయ్యి ఎకరాలకు అవసరమగు చిరుధాన్యాలు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యేకు అధికారులు వివరించగా, ఈ సంవత్సరం రైతులకు చిరుధాన్యాల విత్తనాలు సబ్సిడీతో ఇవ్వనున్నట్లు అందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు.

సబ్సిడీపై జనుము జీలుగు
ఆరుతడి పంటలు పండించే సమయంలో రసాయన ఎరువులు వాడకంతో చీడ పీడలు చేరి పంటలు దెబ్బతింటాయని, దాంతో క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయని, అలాంటి సమయంలో పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలుగ వాడడంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. 65 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట ఎరువులు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 30 కిలోలకు 1545 రూపాయలు ఉండగా, 65 శాతం సబ్సిడీతో 545 రూపాయలకే రైతులకు అందుబాటులో ఉందన్నారు.

అన్ని సొసైటీల్లో ఎరువుల సరఫరా
ఈ సంవత్సరం సాగుకు అవసరమగు 1.20 లక్షల బస్తాల ఎరువులు అవసరమవుతున్నాయని, అందుకు ప్రణాళిక రూపొందించామని అధికారులు తెలుపగా, ఎక్కువగా ఎరువులను ఆయా గ్రామాల్లోని సొసైటీ కేంద్రాల్లో అందుబాటులో ఉండే విధంగా చూడాలని, ప్రతి గ్రామంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు
నకిలీ విత్తనాలు రైతులకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దుకాణాలు సీజ్ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్‌ను ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై అవసరమైతే పీడీ యాక్టు కేసులు పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్, ఎంపీపీలు ఎర్ర యాదయ్య, కూర మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దువ్వల మల్లయ్య, శ్రీహరిగౌడ్, ఎల్లారెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏవో పర్శరామ్‌రెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...