సమన్వయం..సక్సెస్ మంత్రం..


Fri,May 24, 2019 04:45 AM

-కలిసి పనిచేసిన టీఆర్‌ఎస్ శ్రేణులు
-అందరిని సమన్వయ పరిచిన వేముల, తన్నీరు
-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలంతా ముమ్మర ప్రచారం
-రెండు చోట్ల విజయంపై సంబురాలు

(సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి);అధికార పార్టీ నేతలు సమన్వయంతో పని చేయడంతో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రధానంగా మంత్రి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు విస్తృతంగా ప్రచారం చేశారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్‌కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. బాధ్యతలు తీసుకున్న వెంటనే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేసి అందరిని సమన్వయ పరిచారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వారికి దిశా నిర్దేశం చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని నాయకులను, లీడర్లను సమన్వయ పరచడంతో పాటు తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో కూడా హరీశ్‌రావు సమావేశాలు ఏర్పాటు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొన్నారు.

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని దాదాపు అన్ని మండలాల్లో ప్రచారం చేశారు. దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డితో పాటు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఇతర నేతలు ప్రచారం చేశారు. గజ్వేల్‌లో కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, భూంరెడ్డి, పార్టీ నాయకుడు ప్రతాప్‌రెడ్డిలు ప్రచారం చేశారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లకా్ష్మరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి మురళీయాదవ్‌లు విస్తృతంగా ప్రచారం చేశారు. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఇతర నాయకులు జోరుగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయ పరచడంతో పాటు రోజువారిగా ప్రచారంపై హరీశ్‌రావు సమీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉండగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్‌లో కూడా టీఆర్‌ఎస్ జోరుగా ప్రచారం చేసింది.

అయితే జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఓట్లు తగ్గినప్పటికీ మిగతా రెండు నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చింది. అందోల్‌తో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేయడంతో విజయం సాధించారు. నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావుతో పాటు ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ ఇతర నేతలు ప్రచారం చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అటు కామారెడ్డి జిల్లాతో పాటు ఇటు సంగారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణులను సమన్వయ పరిచారు. తాను సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ప్రచారంపై సమీక్షలు చేశారు. ఇలా ముఖ్య నేతలు ప్రత్యేక బాధ్యత తీసుకుని అందరిని సమన్వయ పరచడంతోనే ఉమ్మడి జిల్లా పరిధిలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌లు విజయం సాధించారు.

ఎంపీలకు హరీశ్‌రావు అభినందనలు..
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. ఉదయం నుంచే హరీశ్‌రావు నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డిలతో కలిసి కౌంటింగ్ సరళిని మీడియా నుంచి తెలుసుకున్నారు. భారీ మెజార్టీ రాగానే బయటకు వచ్చి ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని అభినందించారు. భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మహిపాల్‌రెడ్డిలతో పాటు ఇతర నేతలు కూడా కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి హరీశ్‌రావు గీతం యూనివర్సిటీకి చేరుకుని బీబీ పాటిల్‌ను అభినందించారు. తిరిగి రెండోసారి ఎంపీలుగా గెలుపొందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌లను ఆలింగనం చేసుకున్నారు. రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ హరీశ్‌రావుతో పాటు ఎంపీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రెండోసారి ఎంపీలుగా..
మెదక్, జహీరాబాద్ నుంచి విజయం సాధించిన కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌లు రెండోసారి ఎంపీలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2014లో ఎంపీ బీబీ పాటిల్ మంచి మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మెదక్ పార్లమెంట్ స్థానంతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. రెండు చోట్ల విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీనితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలోనే సీఎం కేసీఆర్ కొత్త ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా బరిలో నిలిపారు. అప్పటి ఎన్నికల్లో కూడా కొత్త భారీ మెజార్టీతో విజయం సాధించగా తిరిగి ఇప్పుడు కూడా 3.16 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. ఐదేండ్లపాటు ఎంపీలుగా పనిచేసి ఇద్దరు మంచి పేరు సంపాదించుకున్నారు. ఇద్దరు సౌమ్యులే. తిరిగి ఎంపీలుగా విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...