వచ్చేనెల రెండోవారంలో హరితహారం


Wed,May 22, 2019 01:59 AM

-వర్షాలు పడిన వెంటనే నాటేందుకు సన్నాహాలు
-ఈ ఏడాది లక్ష్యం 2.75 కోట్ల మొక్కలు
-జిల్లావ్యాప్తంగా 800 ఎకరాల్లో నాటేందుకు ప్రణాళిక
-ప్రతి గ్రామ నర్సరీలో అందుబాటులో 40వేల మొక్కలు
-శాఖల వారీగా టార్గెట్‌లను సిద్ధం చేసిన అధికారులు
-టేకుతో పాటు శ్రీగంధం మొక్కలకు ప్రాధాన్యం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేశారు. జూన్ మాసం ప్రారంభంలోనే వర్షాలు షురూ అయినట్లయితే జూన్ రెండో వారంలోనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటేందుకుగాను నర్సరీల్లో మొక్కలను కూడా సిద్ధం చేశారు. గుంతలు తీసే ప్రక్రియ దాదా పు పూర్తి కావొచ్చింది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. అదేవిధంగా మొక్కలను నాటిన అనంతరం విస్మరించడం కాకుండా ప్రతీ మొక్కను బ్రతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతీ మొక్కకు జియోట్యాగింగ్ చేయనున్నారు. ఈ ఏడాది ప్రధానం గా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్దితోపాటు పూలు, పండ్ల మొక్కలను నాటేందుకు ప్రాధాన్యతనివ్వనున్నారు. అడవులను పెంచేందుకుగాను జిల్లాలోని ఆయా అటవీ ప్రాంతంలో మొక్కలను నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.

అదేవిధంగా గతేడాది నాటిన మొక్కల్లో 81 లక్షల మొక్కలు మాత్రమే బ్రతకడంతో ఈ ఏడాది మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు కూడా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది అడవులను పెంచడంపై జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా 800 ఎకరాల్లోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేలా అటవీ శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలోని ధారూర్, తాండూర్, అన్నాసాగర్, తట్టేపల్లి, కల్కొడ, వికారాబాద్ అటవీ ప్రాంతంలోని బుగ్గ రామేశ్వరం ఆలయ పరిసరాల్లో అడవి మొక్కలను నాటనున్నారు. టేకు మొక్కలతోపాటు చైనా బాదం, కానుగ, నెమలి నార తదితర మొక్కలను నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.

ఈ ఏడాది టార్గెట్ 2.75 కోట్ల మొక్కలు...
హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 2.75 కోట్ల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. జిల్లాలోని 18 మండలాల్లో ఏయే మండలంలో ఎన్ని మొక్కలను నాటాలనే దానిపై సంబంధిత అధికారులు మార్చిలోనే ప్రణాళికను రూపొందించారు. ఈ ఏడాది టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. 4 లక్షల ఈత మొక్కలతోపాటు 20 వేల శ్రీగంధం మొక్కలతో నిర్దేశించిన లక్ష్యంలో 40 శాతం టేకు మొక్కలను నాటనున్నారు. రాయలసీమలో ఎక్కువగా ఉండే శ్రీగంధం మొక్కలను ఈ ఏడాది జిల్లాలో కూడా నాటనున్నారు. ఈ దఫా హరితహారంలో అటవీ శాఖ-15 లక్షలు, డీఆర్‌డీఏ -80 లక్షలు, విద్యాశాఖ-12 లక్షలు, ఎక్సైజ్ శాఖ-10 లక్షలు, వైద్యారోగ్య శాఖ-2 లక్ష లు, విద్యుత్తు శాఖ-6 లక్షలు, పోలీస్ శాఖ-10 లక్షలు, ఉద్యానవన శాఖ-5 లక్షలు, రెవెన్యూ శాఖ-8 లక్షలు, మార్కెటింగ్ శాఖ-2 లక్షలు, గనుల శాఖ-20 లక్షలు, మైనార్టీ శాఖ-30 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు-3.41 లక్షలు, వ్యవసా య శాఖ-25 లక్షలు, డీఎస్‌సీవో-5 లక్షలు, పంచాయతీరాజ్ శాఖ-7 లక్షలు, ఆర్‌అండ్‌బీ- 7 లక్షలు, నీటిపారుదల శాఖ-10 లక్షలు, పంచాయతీ శాఖ- 25 లక్షలు, తాండూర్, వికారాబాద్ మున్సిపాలిటీలు-2 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్-25 వేలు, ఆర్టీసీ-30 వేలు, జర్నలిస్టులు- 2 వేలు, ఖజానా శాఖ-2 వేలు, సహాకార శాఖ-1.20 లక్షలు, పశుసంవర్ధక శాఖ- లక్ష, జాతీయ రహాదారులు-25 వేలు, దేవాదాయ శాఖ-10 లక్షలు, రైల్వే శాఖ-1.50 లక్షలు, పరిశ్రమల శాఖ-1.50 లక్షల మొక్కలను నాటాలని టార్గెట్‌ను సిద్ధం చేశారు.

అదేవిధంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 4 లక్షల ఈత మొక్కలను కూడా నాటనున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకుగాను ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటనున్న ఈత మొక్కలను ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సోసైటీలకు ఇచ్చిన భూముల్లో, కల్లుగీత కార్మికుల సొంత భూముల్లో, చెరువు గట్లపై ప్రభుత్వ స్థలాల్లో ఈత మొక్కలను నాటనున్నారు. అయితే ఇప్పటివరకు 65 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా గతేడాది 1,66 కోట్ల మొక్కలను నాటగా.., 81 లక్షల మొక్కలు మాత్రమే బ్రతకినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

గ్రామానికి ఒక నర్సరీ: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా నాటనున్న మొక్కలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 565 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. వీటిలో 81 నర్సరీలు అటవీ శాఖ, 484 నర్సరీలు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో 40 వేల మొక్కలను నాటేలా ప్లాన్‌ను సిద్ధం చేశారు. ప్రతీ గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...