మిషన్‌ భగీరథ నీటిని వృథా చేయొద్దు


Mon,May 20, 2019 11:19 PM

దుబ్బాక టౌన్‌: స్వరాష్ట్ర కలను దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మిషన్‌ భగీరథ ద్వారా పొందుతున్నారని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఏండ్ల తరబడి భయంకరమైన తాగునీటి కష్టాలను దూరం చేసిన సీఎం కేసీఆర్‌ను ఊరూరా దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు. మిషన్‌ భగీరథ పథకాన్ని మొదటి దశలోనే మంజూరు చేసి గత ఐదేండ్లుగా తాగునీటి కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మిషన్‌భగీరథ ద్వారా అందే గోదావరి తాగునీటిని వృథా చేయవద్దన్నారు. ఎందరో నిర్వాసితులు భూములతో పాటు సర్వం కోల్పోయి భగీరథ పథకం ప్రాజెక్టులకు త్యాగం చేయడం వల్లనే మనం స్వచ్ఛమైన నీళ్లను తాగుతున్నామని ఆయన అన్నారు. వారి త్యాగ ఫలితంగా మనం నీటి గోస నుంచి బయటపడి సంతోషంగా ఉన్నామన్నారు. 350 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలు మన గడపలోకి వచ్చి గొంతులను తడుపుతుండటం ప్రభుత్వ సాహసోపేతమైన పథకానికి నిదర్శనమన్నారు. అలాంటి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయొద్దని ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రజలను కోరారు. దుబ్బాక నియోజకవర్గంలో మిషన్‌భగీరథ పథకంలో 140 వాటర్‌ ట్యాంకులను కొత్తగా ఏర్పాటు చేసి వీటి ద్వారా ప్రతి రోజు 2 కోట్ల 40 లక్షల లీటర్ల తాగునీటిని ప్రజలకు ఇంటింటికీ అందిస్తున్నామన్నారు. నీటి వినియోగంలో ప్రజలు సహకరించాలన్నారు. ప్రతి రోజు ఇంటింటికి గోదావరి జలాలు అందించేందుకు సంబంధిత అధికారులు చిత్తశుద్ధ్దితో పని చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో నీటి సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తుతే వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్‌, నాయకులు కడతల రవీందర్‌రెడ్డి, రొట్టె రమేశ్‌, పడాల నరేశ్‌, లచ్చపేట నర్సింలు ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...