ప్రేమ కోసం తనువు చాలించారు..


Thu,May 16, 2019 11:31 PM

-ప్రేమ జంట ఆత్మహత్య
-పెద్దలు మందలించి జరిమానా విధించినా వీడని బంధం
-ప్రేమ విఫలమైందని మనస్థాపం
-మొదట విషం తాగి..
ఆపై ఉరివేసుకొని ఆత్మహత్య.
-పాఠశాల భవనంలో\ప్రాణాలు వదిలారు..
-లకుడారంలో నెలకొన్న విషాదఛాయలు
కొండపాక : వారిద్దరిది ఒకే ఊరు.. చాలా ఏండ్లుగా ఒకరినొకరు చూసుకుంటూ చివరకు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు.. జీవితంలో పెళ్లి అనే బంధంతో ముందుకు సాగాలని కలలు కన్నారు.. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఇద్దరిని మందలించారు.. అయినప్పటికీ తరుచుగా కలుసుకున్నారని తెలిసి జరిమాన కూడా విధించారు.. ప్రేమను విడిచిపెట్టలేక.. పెద్దవాళ్లను కాదనలేక... తీవ్రమనస్థాపానికి గురైన ఓ యువప్రేమ జంట చివరకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలను వదిలేసిన సంఘటన కొండపాక మండల పరిధిలోని లకుడారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుకునూర్‌పల్లి ఎస్‌ఐ పరమేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం... లకుడారం గ్రామానికి చెందిన మంజె కనకయ్య (21), రాచకొండ తార (19), ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వీరి తల్లితండ్రులకు తెలియడంతో మందలించారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే విషయంలో కనకయ్యకు రూ.30 వేల జరిమాన కూడా విధించారు.

అయినప్పటికీ కనకయ్య, తార ఒకరినొకరు వదిలి ఉండలేకపోయారు. కులాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలోకి వెళ్లారు. ప్రేమ విఫలం కావడంతో మనస్థాపానికి గురైన కనకయ్య, తార ముందుగా వారి వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం పాఠశాల పైఅంతస్తులోని ఓ గదిలోకి వెళ్లి ఒకే తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు.

బుధవారం నుంచి కనిపించడంలేదు
ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న ప్రేమికులు కనకయ్య, తార బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటికి వచ్చారు. రాజీవ్హ్రదారి పక్కన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలోకి చేరుకున్నారు. ఇండ్లల్లో వీరిద్దరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అటుగా వెళ్లినవారు పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఇద్దరు ఉరి వేపుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించింది. దీంతో వెంటనే కుకునూర్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు.

ఆంజనేయస్వామి మాలలోనే..
ప్రేమ విఫలం కావడంతో ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో మృతుడు కనకయ్య ఆంజనేయస్వామి మాలధారణలో ఉండటం పలువురిని కలిచి వేసింది. కనకయ్య 10 రోజుల క్రితమే ఆంజనేయస్వామి మాలను ధరించాడు. మరో 10 రోజులైతే మాలవిరమణ చేయాల్సి ఉంటుంది అనగా ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కనకయ్య, తార ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలుసుకున్న ఇరువురు కుటుం బ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. గ్రామానికి చెందిన యువ ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో లకుడారం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ మేరకు కుకునూర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...