నేటి నుంచి తొలి విడుత నామినేషన్లు


Sun,April 21, 2019 11:24 PM

- ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు
-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 24 తుది గడువు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల తొలి విడుత నామినేషన్లు నేటి (సోమవారం) నుంచి స్వీకరించనున్నారు. జిల్లాలోని 23 జడ్పీటీసీ స్థానాలు, 229 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడుతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే నెల 6,10,14 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో తొలి విడుతలో సిద్దిపేట డివిజన్‌లోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయనున్నారు. ఇందుకోసం నేడు నోటిఫికేషన్‌ను విడుదల చేసి వెనువెంటనే నామినేషన్లను స్వీకరిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను ఆయా మండల కేంద్రాల్లోనే స్వీకరిస్తారు. జడ్పీటీసీ నామినేషన్లు కూడా మండల కేంద్రాల్లోనే స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తొలి విడుత నామినేషన్లు స్వీకరిస్తారు. 25న స్క్రూట్నీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు సమయముంది. మే 6న పోలింగ్ ఉంటుంది. తొలి విడుతలో సిద్దిపేట అర్బన్ మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలు, సిద్దిపేట రూరల్‌లో 8, నారాయణరావుపేటలో 5, నంగునూరులో 11, చిన్నకోడూరులో 14, తొగుటలో 10, మిరుదొడ్డిలో 11, దుబ్బాకలో 13, దౌల్తాబాద్‌లో 9, రాయపోల్‌లో 8 మొత్తం 96 ఎంపీటీసీ స్థానాలు, 10 జడ్పీటీసీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
తొలి విడుత ఎన్నికలు జరిగే మండలాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీల అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు పూర్తి చేశారు. అధికారికంగా ఆయా మండలంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీల పేర్లను టీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం వెల్లడించనుంది. సిద్దిపేట, మెదక్ జిల్లాల టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్య నాయకులతో చర్చించి, పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశం కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల జాబితా నేడు లేదా రేపు అధికారికంగా వెలువడనుంది. సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అభ్యర్థుల ఎంపికపై తుది జాబితా విడుదల చేయనున్నారు. దుబ్బాక శాసన సభ్యులు సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకత్వంతో చర్చిస్తున్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...