రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు


Sat,April 20, 2019 11:34 PM

దుబ్బాక టౌన్ : దుబ్బాక నియోజక వర్గం వాయువేగంగా అభివృద్ధి లో దూసుకుపోతుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. దుబ్బాకలో రూ.కోటి నిధులతో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన నిర్మాణ పనులు, బీసీ కాలనీలో డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనుల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుబ్బాకలో సుమారు 50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ దుబ్బాకకు అందించిన నిధులు నయాపైసా వృథా కాకుండా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే తన లక్ష్యమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి పనులను కొందరు అడ్డుతగలడం బాధాకరమన్నారు. ఆధునాతన కూరగాయల మార్కెట్, అంబేద్కర్ భవనం నిర్మాణాలకు అడ్డుతగులుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా అభివృద్ధి పనులు ఆగవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు వెయ్యి డబుల్ బెడ్‌రూం ఇం డ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. హమాలీ కార్మికులకు ప్రత్యేక కాలనీగా ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దుబ్బాక పట్టణంలో 15 బ్లాక్‌లో వెయ్యి ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, దుబ్బాక ఏఎంసీ మాజీ చైర్మన్ ఎల్లారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్, నాయకులు మల్లారెడ్డి, రొట్టె రమేశ్, బండిరాజు, పడాల నరేశ్, శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...