పగబట్టిన ప్రకృతి


Fri,April 19, 2019 11:25 PM

- వడగండ్లు, ఈదురుగాలులతో నేలకొరుగుతున్న పంటలు
- రాలిపోతున్న ధాన్యం, మామిడికాయలు
- నాలుగు మండలాల్లో వర్ష బీభత్సం
- కూలిన ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు స్తంభాలు, భారీ వృక్షాలు
- జిల్లాను కుదేలు చేస్తున్న అకాల వర్షాలు

చిన్నకోడూరు : జిల్లాపై ప్రకృతి పగబట్టినట్లుంది. వరుసగా అకాల వానలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. రెండుమూడు రోజులుగా ఈదురుగాలులు, వడగండ్లు పడగా, శుక్రవారం కూడా చిన్నకోడూరు, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి మండలాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. పెద్దపెద్ద రాళ్లు పడడంతో ఇంటిపైకప్పులు ధ్వంసమయ్యాయి. తీవ్రగాలులకు పలుచోట్ల వరిపైరు ఒరిగిపోగా, వేలసంఖ్యలో మామిడికాయలు నేలరాలాయి. చిన్నకోడూరు మండలం చర్లఅంకిరెడ్డిపల్లిలో విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతిన్నది. కోహెడ మండలంలో గంటపాటు కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల రేకులు లేచిపోయి, ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీసైజు రాళ్లు పడడంతో జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు రాలేదు.

పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో వరి గింజలు నేలరాలాయి. చిన్నకోడూరు మండలం అనంతసాగర్, చర్లఅంకిరెడ్డిపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల ధాటికి వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు నష్టం అంచనాను సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. చర్లఅంకిరెడ్డిపల్లిలో 11కేవీ విద్యుత్ తీగలతో కూడిన 16 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతసాగర్‌లో వరి గింజలు వడగండ్ల ధాటికి పూర్తిగా రాలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్లఅంకిరెడ్డిపల్లిలో మామిడి తోటల్లో మామిడి కాయలన్నీ నేలరాలాయి. గ్రామంలో వాటర్ ప్లాంట్ పైకప్పు రేకులు పూర్తిగా లేచిపోయి ధ్వంసమయ్యాయి.

మర్కూక్‌లో..
మర్కూక్: మండలంలోని శివారువెంకటాపూర్, బవానందపూర్, యూసుఫ్‌ఖాన్‌పల్లి గం గాపూర్, దామరకుంట, మర్కూక్ మండల కేం ద్రం గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. దీంతో గ్రామంలో వరి, మామిడి, టమాట పంటలకు తీవ్ర నష్టం వాటిలింది. పొట్టదశకు వచ్చిన వరిపంట దెబ్బతిన్నాయి. మామిడి తోటలో మామిడి కాయలు నేలరాలయి.రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లడుతూ ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కోహెడలో
కోహెడ : మండలంలో శుక్రవారం 4గంటల ప్రాంతంలో పెనుగాలులు, వడగండ్లతో భారీ వర్షం కురిసింది. మండలంలోని సముద్రాల, మైసంపల్లి, శనిగరం, చెంచెల్‌చెర్వుపల్లి, కోహెడ, శ్రీరాములపల్లి, వెంకటేశ్వర్లపల్లి, తంగల్లపల్లి, ధర్మసాగర్‌పల్లి, కూరెల్ల గ్రామాల్లో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రేకుల షెడ్లు లేచిపోయాయి. ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మామిడి చెట్లు విరిగి కాయలు నేలరాలాయి. భారీగా వరి, మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడంతో మండల రైతులు కంటతడి పెట్టారు. సుమారు గంట సేపు కురిసిన రాళ్ల వర్షంతో రోడ్డుపైకి రావడానికి జనం భయపడ్డారు. తహసీల్దార్ అనిల్‌కుమార్ తంగల్లపల్లిలో పర్యటించి రాళ్ల వాన నష్టాన్ని పరిశీలించారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే, వ్యవసాయ అధికారులు
అక్కన్నపేట: అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని ధర్మారం, రేగొండ, గోవర్దనగిరి, పోతారం(జె), మల్‌చెర్వుతండా గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. దీంతో మామిడి, వరిచేలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా, శుక్రవారం హుస్నాబాద్ ఎమ్మె ల్యే వొడితెల సతీశ్‌కుమార్ గోవర్దనగిరి, రేగొండ గ్రామాల్లోని మామిడి తోటలను పరిశీలించారు. బాధిత రైతులతో నష్టం వివరాలు తెలుసుకుని వ్యవసాయాధికారులతో మాట్లాడి రైతులకు పరిహారం అందేలా చూడాలని సూచించారు. మసిరెడ్డితండా, పోతారం(జె), నందా రం, గోవర్థనగిరి గ్రామాల్లో వ్యవసాయాధికారి నాగేందర్‌రెడ్డి పర్యటించి దెబ్బతిన్న పంటలను సర్వేచేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ భూక్యమంగ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మ్యాక నారాయణ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కందుల రాంరెడ్డి, పెండ్యాల అయిలయ్య, మాలోతు బీలునాయక్‌తోపాటు సర్పంచ్‌లు పాల్గొన్నారు.

బెజ్జంకి మండలంలో
బెజ్జంకి: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం రాళ్ల వర్షం కురిసింది. దీంతో కోత దశకు వచ్చిన వరిపంటలో వడ్లు రాలటంతోపాటు, నేలకొరిగాయి. మామిడికాయలు సైతం గాలికి నేలరాలాయి. గుగ్గిళ్లల్లో పెద్ద రాళ్ల వర్షం పడి, పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...