ధాన్యం కొనుగోలుకు రెడీ


Wed,April 17, 2019 11:44 PM

- జిల్లావ్యాప్తంగా లక్షా 20 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
- ప్రభుత్వం ఆధ్వర్యంలో 163 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
- ఐకేపీ ఆధ్వర్యంలో 107, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 56 కేంద్రాలు
- ఈనెల 20 నుంచి కేంద్రాలు ప్రారంభం
- కొనుగోలు కేంద్రాలతోపాటు రైస్‌మిల్లులకు జియోట్యాగింగ్
- ఎప్పటికప్పుడు ఎంత ధాన్యం వచ్చిందో తెలుసుకునే చాన్స్
- ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్‌కు రూ.1770, సాధారణ రకానికి రూ.1750
- తూకమైన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ
- జిల్లాలో ముమ్మరంగా వరికోతలు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాసంగి వరికోతలు జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ధాన్యం చేతికొస్తుండడంతో రైతులు దళారులబారిన పడకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందిరా క్రాంతిపథం ఆధ్వర్యంలో 107, సహకార సంఘాల ఆధ్వర్యంలో 56.. మొత్తం 163 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా..అన్ని కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లులను ఈసారి జియోట్యాగింగ్ చేశారు. ప్రతిరోజు ఎంత కొనుగోలు జరిగింది ? ఏ మిల్లుకు ఎంత తరలించారనే విషయం ఈజీగా తెలిసిపోతుంది. గతేడాది వానలు మోస్తరుగా కురవడంతో ధాన్యం దిగుబడి తక్కువ ఉంటుందని అంచనా వేసి జిల్లావ్యాప్తంగా లక్షా 20 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. గత యాసంగి సీజన్‌లో 1.10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.180 కోట్లు చెల్లించారు. ధాన్యం మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి రూ.1770, సాధారణ రకానికి రూ.1750 నిర్ణయించారు. ధాన్యం తూకం పూర్తయిన 24 గంటల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు. కొనుగోళ్లు త్వరగా పూర్తిచేసేందుకు 2 లక్షల గన్నీబ్యాగులను సిద్ధం చేశాం. మరో 5 లక్షల బ్యాగులు రానున్నాయని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కాగా, ఈ నెల 20నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారయంత్రాంగం చర్యలు తీసుకున్నది. ఈ యాసంగి సీజన్‌లో లక్షా 20 వేల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 163 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ సైతం పూర్తి చేసిన యంత్రాంగం, ఈ సారి కొత్తగా అన్ని మిల్లులు, కొనుగోలు కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయనున్నది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏ మిల్లుకు ఎంత పంపించాలన్న దానిపై ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటై అన్ని మిల్లులను సందర్శించి, వాటి సామర్థ్యానికి అనుగుణంగా రిపోర్టు తయారు చేసి రాష్ట్ర సివిల్ సప్లయి కమిషనర్‌కు పంపించారు. అక్కడ నిర్ణయించిన ప్రకారమే మిల్లు సామర్థ్యానికి అనుగుణంగా జిల్లాలో ఉన్న 37 రైస్ మిల్లులకు ధాన్యం పంపించనున్నారు.

30,288 హెక్టారులో వరి
జిల్లాలో యాసంగిలో 30,288 హెక్టారులో వరి సాగు చేయగా, 1,89,300 టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఇందులో 19 వేల టన్నులు సన్నరకం, లోకల్ సీడ్ కింద మరో 20 వేల టన్నుల ధాన్యం పోనూ మిగిలింది 1,50,000 టన్నుల ధాన్యం సేకరించాలి. కొంత మంది రైతులు నేరుగా మిల్లర్లకు అమ్మేవారుంటారు. ఇలా ఇవన్నీ పోనూ జిల్లా వ్యాప్తంగా ఈ సారి 1.20లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కాగా, గత యాసంగి సీజన్‌లో 1.10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు రూ.180 కోట్లు చెల్లించారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీల ఆధ్వర్యంలో 107 కేంద్రాల ద్వారా 70 వేల టన్నుల ధాన్యం, సొసైటీల ఆధ్వర్యంలో 56 కేంద్రాల ద్వారా 50 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగా 2 లక్షల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచారు. మరో 5 లక్షల గన్నీ బ్యాగులు జిల్లాకు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాలపై జేసీ పద్మాకర్, డీఎస్‌వో వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గ్రేడ్-ఏ రకం క్వింటాల్‌కు రూ.1,770, సాధారణ రకానికి రూ.1,750 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభానికి ముందే గన్నీ బ్యాగులు, తాగునీటి సౌకర్యం, మహిళల కోసం తాత్కాలిక టాయిలెట్స్, కరెంట్, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్స్, తేమ కొలిచే మీటర్లు అందుబాటులో ఉండేలా ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లించనున్నారు.

రైస్‌మిల్లులు, కొనుగోలు కేంద్రాలకు జియోట్యాగింగ్
ఈసారి కొత్తగా అన్ని రైస్‌మిల్లులతో పాటుగా 163 కొనుగోలు కేంద్రాలను జియోట్యాగింగ్ చేశారు. ఏ కొనుగోలు కేంద్రంలో ఎంత ధాన్యం వచ్చింది? రైతులకు సదుపాయాలు ఎలా ఉన్నాయి? రైతులు తెచ్చిన ధాన్యం తూకం జరుగుతుందా? లేదా? అనే తదితర వివరాలను డీఎస్‌వో కార్యాలయం నుంచి తెలుసుకోవచ్చు. రాష్ట్ర సివిల్ సప్లయి కమిషనర్ ఆదేశానుసారం డీఎస్‌వోతో పాటు మరో నలుగురితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జిల్లాలోని అన్ని మిల్లులను సందర్శించి ఏ మిల్లు ఎంత సామర్థ్యం కలిగి ఉంది? అనే వివరాలను సేకరించి, ఒక నివేదికను కమిషనరేట్ కార్యాలయానికి పంపించింది. దీనిని పరిశీలించి, ఒక్కో రైస్‌మిల్లుకు ఎంత కేటాయించాలో సూచించి, పంపించిన నివేదికకు అనుగుణంగా జిల్లా అధికారులు 37 మిల్లులకు రోజు వారీ సామర్థ్యం నిర్ణయించింది. రోజుకు ఒక్కో మిల్లుకు దాని సామర్థ్యాన్ని బట్టి 32 టన్నుల నుంచి 60 టన్నుల ధాన్యాన్ని పంపిస్తారు. ఇది కాకుండా జిల్లాలో మరో 5 మిల్లులు రెడీ అవుతున్నాయి. మొత్తంగా జిల్లాలోని అన్ని మిల్లులు కలుపుకొని 2 లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంది.

ఐకేపీ ఆధ్వర్యంలో కేంద్రాలు
రామవరం, గోవర్ధనగిరి, జనగామ, ఆకునూరు, తాడూరు, వీరన్నపేట, నాగపూరి, చేర్యాల ఏఎంసీ అవుట్ సైడ్, పోతిరెడ్డిపల్లి, విఠలాపూర్, మైలారం, అల్లీపూర్, ఎల్లాయిపల్లి, ఇబ్రహీంనగర్, గోనేపల్లి, కిస్టాపూర్, రామంచ, చిన్నకోడూరు, సూరంపల్లి, దొమ్మాట, గోవిందాపూర్, ఉప్పరపల్లి, గంభీర్‌పూర్, గోసాన్‌పల్లి, ఆకారం, బొప్పాపూర్, ధర్మాజీపేట, హబ్సీపూర్, తిమ్మాపూర్, అప్పనపల్లి, బల్వంతపూర్, చిట్టాపూర్, రాజక్కపేట, చేర్వాపూర్, పెద్దగుండవెల్లి, పోతారెడ్డిపేట, పోతారం, చీకోడు, ఖమ్మర్లపల్లి, చల్లాపూర్, రామక్కపేట, అహ్మదీపూర్, సింగాటం, బస్వాపూర్, కోహెడ, సింగారం, తంగళ్ళపల్లి, వర్కోలు, గుండారెడ్డిపల్లి, కూరెళ్ల, కొమురవెల్లి, ఐనాపూర్, గౌరాయిపల్లి, గురువన్నపేట, దుద్దెడ, సిరిసినగండ్ల, నర్సాయిపల్లి, మద్దూరు, లింగాపూరు, కొండాపూరు, బైరాన్‌పల్లి, అల్వాల్, జంగపల్లి, ఖాజీపూరు, మిరుదొడ్డి, రుద్రారం, మోతె, చెప్యాల, అందె, మల్లుపల్లి, వీరారెడ్డిపల్లి, ధర్మారం, కాసులాబాద్, రాజగోపాల్‌పేట, పాలమాకుల, సిద్దన్నపేట, గట్లమల్యాల, ఖాత, రాయపోల్, తోర్నాల, చింతమడక, చిన్నగుండవెల్లి, గుర్రాలగొంది, ఇబ్రహీంపూర్, ఇర్కోడు, జక్కాపూర్, లక్ష్మిదేవిపల్లి, నారాయణరావుపేట, పెద్దలింగారెడ్డిపల్లి, పుల్లూరు, రావురూకుల, మాచాపూరు, గోపులాపూర్, బక్రిచెప్యాల, పొన్నాల, ఘణపూర్, గుడికందుల, కాన్గల్, లింగాపూర్, రాంపూర్, తుక్కాపూర్, వేములఘట్, వెంకట్రావ్‌పేట, ఎల్లారెడ్డిపేట, జప్తిలింగారెడ్డిపల్లి, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

పీఏసీఎస్ ఆధ్వర్యంలో..
అక్కన్నపేట, కట్కూరు, బెజ్జంకి, తోటపల్లి, రేగులపల్లి, గుగ్గిళ్ళ, బేగంపేట, గాగిళ్ళపూర్, చేర్యాల ఏఎంసీ, ఐనాపూర్, అనంతసాగర్, కిష్టాపూర్, ఏఎంసీ దౌల్తాబాద్, ఏఎంసీ దుబ్బాక, రఘోత్తంపల్లి, దుంపలపల్లి, ఏఎంసీ గజ్వేల్, ఏఎంసీ హుస్నాబాద్, కుందన్‌వానిపల్లి, పందిల్ల, మల్లంపల్లి, పొట్లపల్లి, మడ్ద, పోతారం(జే), మీర్జాపూర్, కేశవపూర్, జగదేవ్‌పూర్, వర్దరాజ్‌పూర్, వట్‌పల్లి, ఏఎంసీ కోహెడ(వెంకటేశ్వరపల్లి), వింజపల్లి, సముద్రాల, నారాయణపూర్, శ్రీరాములపల్లి, కొండపాక, మర్పడగ, రేబర్తి, దూల్‌మిట్ట, లద్నూరు, అర్జున్‌పట్ల, సలాక్‌పూర్, మర్కూక్, భూంపల్లి, తునికిబొల్లారం, నంగునూరు, అరెపల్లి, బద్దిపడగ, ఖానాపూర్, రాఘవాపూర్, మాటిండ్ల, మల్యాల, సిద్దిపేట ఏఎంసీ, మిట్టపల్లి, ఏఎంసీ తొగుట, వర్గల్, వేలూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తారు.

రైతులకు అందుబాటులో కేంద్రాలు
యాసంగి వరి కోతలు ప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలో రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ సారి జిల్లా వ్యాప్తంగా సుమారుగా లక్షా 20 వేల టన్నుల ధాన్యంను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం నిర్వాహకులకు శిక్షణ కూడా ఇచ్చాం. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
- జాయింట్ కలెక్టర్ పద్మాకర్

ఈ నెల 20 నుంచి కేంద్రాల ప్రారంభం
యాసంగి ధాన్యం సేకరణకు గానూ జిల్లాలో ఈ నెల 20 నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. తట్ పట్టి అందిన రైతులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తాం. తడిసిన, రాళ్లు, తాలుతో కూడిన ధాన్యం తీసుకొస్తే కొనుగోలు చేయరు. ఈ సారి కొత్తగా అన్ని మిల్లులతో పాటుగా 163 కొనుగోలు కేంద్రాలను జియోట్యాగింగ్ చేశాం.
- డీఎస్‌వో వెంకటేశ్వర్లు

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...