ఆకుపచ్చ వనంగా గజ్వేల్


Wed,April 17, 2019 11:42 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: గజ్వేల్ నియోజకవర్గం ఆకుపచ్చ వనంగా మారడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా గజ్వేల్‌లో మొక్కలు నాటి వాటి పెంపకంపై ప్రజల్లో చైతన్యం గత సీజన్‌లో నింపారు. ఈసారి కూడా గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆకుపచ్చ వనంగా మార్చడానికి హరితహరం ఐదో విడుత కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పాత ఐదు మండలాల పరిధిలోని 161 నర్సరీల్లో కోటి 13లక్షల మొక్కలను పెంచుతున్నారు. వర్షకాలానికి ఈ మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండేవిధంగా ప్రత్యేక యాజమాన్య చర్యలు చేపట్టారు. నీటి కొరత, ఎండల తీవ్రతతో మొక్కల పెరుగుదల తగ్గకుండా మొలిచిన మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపడుతున్నారు.

గత నాలుగు విడుతల్లో గజ్వేల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటారు. రోడ్లకు ఇరువైపుల, పొలం గట్లపై బంజరు, అటవీ భూముల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. వాటిని వనసంరక్షణ సభ్యులు కాపాడుతుండగా, అత్యధిక శాతం మొక్కలు ఎదిగి వృక్షాలుగా మారాయి. వచ్చే వర్ష్షకాలంలో మరిన్ని మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, గజ్వేల్ మండలాల్లో ఉపాధి హామీ ద్వారా 110 నర్సరీల్లో 76.02 లక్షల మొక్కలు, అటవీశాఖ అధ్వర్యంలో 51నర్సరీల్లో 36.9లక్షల మొక్కలను పెంచుతున్నారు.

ఎండ నుంచి రక్షణగా..
ఎండకు తట్టుకునేలా నర్సరీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సరీలకు ప్రత్యేక కంచెను ఏర్పాటు చేయడంతో పాటు అయా ప్రాంతలను బట్టి షెడ్‌నెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రతతో మొక్కలు సరిగా ఎదుగడం లేదని గుర్తించిన అధికారులు, నిర్వాహకులకు ఇచ్చిన సూచనల మేరకు మొక్కలకు షెడ్‌నెట్ నీడను ఏర్పాటు చేశారు. వర్గల్ మండలం చాంద్‌ఖాన్ మక్త గ్రామంలో నర్సరీలో ఉన్న మొక్కలకు ఎండతీవ్రత తగ్గించడం కోసం షెడ్‌నెట్‌ను ఏర్పాటు చేశారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...