మహిళా ఓట్లే కీలకం


Mon,March 25, 2019 12:08 AM

- పురుషుల కంటే మహిళా ఓట్లే అధికం
- రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అదే పరిస్థితి
- మండుతున్న ఎండల్లో కేంద్రాలకు ఓటర్లను రప్పించడం సవాలే
- మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రచారంపై పార్టీలు నిమగ్నం

సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. గెలుపోటములను వారే నిర్ణయించనున్నారు. పురుషుల కంటే ఎక్కువ ఓట్లు వారివే ఉండడం ఇందుకు కారణం. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో మహిళల ఓట్లు అధికంగా ఉండడం గమనార్హం. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7.30లక్షల మంది పురుషులుంటే 7.51లక్షల మంది మహిళలు ఉన్నారు. మెదక్ ఎంపీ పరిధిలో 7.95లక్షల మంది పురుషులంటే 7.99లక్షల మంది మహిళలు ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పురుషులకంటే మహిళలు 7379మంది అధికంగా ఉన్నారు. కాగా ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళా ఓటర్లను కేంద్రాలకు రప్పించుకుని ఓట్లు వేయించుకోవడం ఇప్పుడు పార్టీలకు సవాల్‌గా మారింది. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పార్టీలు ముమ్మర ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పది నియోజకవర్గాల్లో మహిళలే అధికం
మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 14అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం నియోజకవర్గాల్లో చూస్తే పదింట్లో మహిళలే అధికంగా ఉండడం గమనార్హం. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం ఒక నారాయణఖేడ్ నియోజకవర్గం మినహా మిగతా 6అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలు అధికంగా ఉన్నారు. అత్యధికంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పురుషులకంటే మహిళలు 7379మంది ఎక్కువగా ఉన్నారు. మొత్తం 7.30లక్షల మంది పురుషులుంటే 7.51లక్షల మంది మహిళలు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 15.95లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 7.99లక్షల ఉన్నారు. అన్ని చోట్ల పురుషులకంటే మహిళలే ఎక్కువగా ఉండగా మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళలు ఎక్కువగా ఉండగా గజ్వేల్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లే అధికంగా ఉండడం విశేషం.

మహిళలను ఆకట్టుకునేలా ప్రచార ప్రణాళికలు
రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహిళా ఓట్లు అధికంగా ఉన్న క్రమంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా రాజకీయ పార్టీలు ప్రచార ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ప్రధానంగా ఆయా పార్టీలు మహిళలకు ఏం చేశాయో చెప్పడమే ప్రదానంశంగా పెట్టుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ కూడా బీడీ కార్మికులు, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు, బతుకమ్మ చీరల పంపిణీ, మహిళల రక్షణకు షీటీమ్స్ ఏర్పాటు, స్త్రీనిధి, స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం, పంచాయతీలో మహిళలకు రిజర్వేషన్లు ఇలాంటి అంశాలను ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ప్రచార వ్యూహలను పార్టీ నేతలు గ్రామస్థాయి నేతలకు సూచించారు. గురువారం రాత్రి టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడంతో శుక్రవారం నుంచి ప్రచారం ముమ్మరం కానున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మూడు రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళా ఓటర్లే పార్లమెంట్ ఎన్నికల్లో కీలకం కానున్న నేపథ్యంలో వారిని ఏ స్థాయిలో పార్టీలు ఆకట్టుకుంటాయో చూడాల్సి ఉంది.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...