వార్ వన్‌సైడే..


Mon,March 18, 2019 11:18 PM

-మెతుకుసీమ ఓ గులాబీ తోట
-2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ బరిలో కేసీఆర్..
-3.97 లక్షల ఓట్లతో ఎంపీగా గులాబీ అధినేత ఘన విజయం
-సీఎంగా బాధ్యతుల చేపట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా
-అదే ఏడాదిలో మెదక్ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక
-3.61 లక్షల ఓట్ల మెజార్టీతో కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు..
-గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోనే...
-అత్యధిక మెజార్టీ రానున్నట్లు పార్టీ శ్రేణుల అంచనా
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:వచ్చేనెలలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో భారీ మెజార్టీ రానున్నది. ప్రస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు కనుమరుగు కావడం, ఊర్లకు ఊర్లు గులాబీ తోటలుగా మారిపోవడంతో వార్‌వన్ సైడేనని తేలిపోతున్నది. అంతేందుకు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేయడానికే వెనకడుగు వేస్తున్నాయి. ఎవరు పోటీ చేయనున్నారో కూడా ఆ పార్టీల నుంచి స్పష్టత రావడం లేదు. ఈక్రమంలో ప్రతిపక్ష పార్టీల్లో అయోమయ పరిస్థితులు నెలకొనగా టీఆర్‌ఎస్‌లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తున్నది. ఇటీవలే మెదక్‌లో జరిగిన సన్నాహక సమావేశాల్లో కూడా నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్‌ను నింపింది.

అసెంబ్లీ ఎన్నికల్లో 3.60 లక్షల మెజార్టీ...
అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు 3.60 లక్షల మెజార్టీ వచ్చింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు 1.18 లక్షల మెజార్టీ రావడం విశేషం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కూడా ఇదే పరిధిలో ఉండడం, ఉద్యమాలకు ఖిల్లాగా పేరొందిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుతం గులాబీ కోట అయ్యింది. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మొదలు పెట్టింది తన పురుటిగడ్డ సిద్దిపేట నుంచి కాగా ప్రజానీకం మొత్తం వెంటనడిచిన విషయం తెలిసిందే. కాగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేసిన గెలుపొందిన విషయం విధితమే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో అదే ఏడాదిలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,61,286 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌కు 3,97,029 భారీ మెజార్టీ వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు 3.60 లక్షల వరకు మెజార్టీ వచ్చింది. ఈ లెక్కన ఇప్పుడు జరుగనున్న ఎన్నికల్లో కూడా మెదక్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

స్నేహపూర్వక సవాల్‌పై ఆసక్తి....
పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుల మధ్య మెజార్టీపై స్నేహపూర్వక సవాల్‌పై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కరీంనగర్, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీకి ఎక్కడ ఎక్కువ వస్తుందో చూడాలంటూ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇటీవల మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కరీంనగర్, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థుల మెజార్టీతో తాము పోటీ పడదామని హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సందర్భంగా మెదక్ కంటే కనీసం రెండు ఓైట్లెనా ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటామని కేటీఆర్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. బావ బావమరుదుల సవాలా..? అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అంటే మేం బాగానే ఉన్నాం... సీఎం కేసీఆర్‌తోనే సవాల్ అంటూ కేటీఆర్ చేసిన స్నేహ పూర్వక సవాల్‌పై ఇంకా చర్చ జరుగుతున్నది. మొత్తంగా ఈ సవాలు మాత్రం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఈ ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారమే మొదలుపెట్టారు.

ప్రతిపక్షాలు కనుమరుగు...
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు దాదాపుగా కనుమరుగయ్యాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికతో గజ్వేల్‌లో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం ఇక్కడ వార్‌వన్‌సైడేనని చెప్పుకోవచ్చు. ఇక మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీల జాడలేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో టీఆర్‌ఎస్‌కే ఓట్లు పడనున్నాయి. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, అతడి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో దుబ్బాక నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. అలాగే మెదక్‌లో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతున్నది. ఇక్కడి నుంచి కూడా ఇతర పార్టీల నాయకులే లేరు.

ఇక నర్సాపూర్‌లలో కూడా కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల చప్పుడు లేకుండా పోయింది. పటాన్‌చెరులో గులాబీ హవా కొనసాగుతున్నది. ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ కూడా పత్తాలేకుండా పోయాయి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి జయప్రకాశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో ఆయన సొంత కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతున్న విషయం తెలిసిందే. పార్టీలో పైరవీలు చేసుకునే వారికే ప్రాధాన్యత ఉన్నదని కూడా తిట్టిపోశారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి పెద్దగా పాల్గొనడం లేదు. ఆయన నియోజకవర్గంలో కూడా కనిపించడం లేదు. కేవలం మీడియాకే పరిమితం అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ హవా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీ రానున్నట్లు స్పష్టం అవుతున్నది.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...