మళ్లీ షురువైన కందుల కొనుగోళ్లు


Fri,February 22, 2019 11:07 PM

-మొదటి విడుతలో 4,41 క్వింటాళ్ల కందులు కొనుగోలు
-49మంది రైతులకు రూ.2.54కోట్లు చెల్లింపు
-హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కందుల కొనుగోళ్లు మళ్లీ మొదలయ్యాయి. కందుల కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మార్కెట్‌లో సందడి నెలకొంది. వివిధ గ్రామాల రైతులు కందులు మార్కెట్‌కు తెచ్చి కుప్పలుగా పోసుకొని విక్రయిస్తున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులు, సిబ్బంది కందుల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. జనవరి 23వ తేదీన మార్కెట్‌ల కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఫిబ్రవరి 16వ తేదీ వరకు కొనుగోళ్లు జరిపారు. చివరలో కందులు మార్కెట్‌కు అంతగా రాకపోవడంతో కొనుగోలు కేంద్రాన్ని 17వ తేదీ నుంచి మూసివేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాళుకు రూ.5,675ల మద్దతు ధర లభిస్తుండగా బయట మార్కెట్‌లో రూ.4,500ల నుంచి రూ.5వేలవరకే ధర పలుకుతున్నది. దీంతో రైతులు బయట విక్రయించుకునేందుకు ముందుకు రావడం లేదు.

రైతుల వద్ద ఇంకా కందులు ఉన్నాయని, మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించాలని రైతుల నుంచి డిమాండ్ రావడంతో శుక్రవారం నుంచి తిరిగి కొనుగోళ్లు చేపట్టారు.
మొదటి విడుతలో 25రోజుల పాటు జరిగిన కొనుగోళ్లలో మొత్తం 4,41క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. మార్కెట్ పరిధిలోని 49మంది రైతులకు చెందిన ,963బస్తాల కందులను కొనుగోలు చేసి మొత్తం రూ.2,54,32,513ల చెల్లించారు. ఆలస్యంగా పంట కోసుకున్న రైతులతో పాటు ఇతర కారణాల వల్ల కందులను మార్కెట్‌కు తేలేకపోయిన రైతులు కొనుగోలు కేంద్రం మూసివేయడంతో ఆందోళనకు గురయ్యారు. కొంతమంది రైతులు మార్కెట్ అధికారులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్‌ను కలిసి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, ఇంకా వందలాది క్వింటాళ్ల కందులు రైతుల ఇండ్లలో ఉన్నాయని చెప్పడంతో స్పందించిన మార్కెటింగ్ అధికారులు వెంటనే తిరిగి కొనుగోళ్లను ప్రారంభించారు. ప్రారంభించిన మొదటి రోజే 9.50 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. కందుల కొనుగోలు కేంద్రం మళ్లీ ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...