ఇటుక వ్యాపారుల ఇష్టారాజ్యం


Wed,February 13, 2019 11:56 PM

-జోరుగా అక్రమ దందా
-ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా బట్టీల నిర్వహణ
-దర్జాగా సర్కారు ఉచిత కరెంటు వినియోగం
-పచ్చటి పొలాలను ధ్వంసం చేస్తున్న నిర్వాహకులు
-బట్టీల్లో మగ్గిపోతున్న బాలకార్మికులు
-కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న అక్రమార్కులు
-పొరుగు రాష్ట్రాల కార్మికుల శ్రమదోపిడీ
-వాల్టా చట్టానికి యథేచ్ఛగా తూట్లు
-కొండపాక మండల మేథినీపూర్‌లో భారీస్థాయిలో ఇటుక దందా
ఇటుక బట్టీల్లో బాల్యం మగ్గిపోతోంది. బలపం పట్టాల్సిన చేతులు బారెడు కష్టాన్ని మోస్తున్నాయి. చదువురాని అమాయకుల శ్రమను అక్రమార్కులు దర్జాగా దోచుకుంటున్నారు. పొట్టచేతపట్టుకొని పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులచే వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. కొండపాక మండలం మేథినీపూర్ గ్రామ శివారులో సుమారు 20 ఎకరాల్లో కొందరు వ్యాపారులు ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. పచ్చటి పొలాలను ధ్వంసం చేస్తూ బట్టీలు నిర్వహించడమే కాకుండా వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత కరెంటును బట్టీల కోసం వినియోగిస్తున్నారు. వాగుల్లో నీటిని మోటర్ల సాయంతో తరలిస్తున్నారు. చెరువులు, కుంటల్లో మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ పనిచేసేందుకు జార్ఘండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్ తదితర ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో కార్మికులను తీసుకొచ్చి న్యాయంగా ఇవ్వాల్సిన కూలీ ఇవ్వకుండా వారి శ్రమను దోచుకుంటున్నారు. బట్టీల సమీపంలో గుడారాలు వేసుకొని ఎలాంటి వసతులు లేకుండా దుర్భర జీవితం గడుపుతున్నారు. వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కుతున్న ఇటుక వ్యాపారులు మాఫియాగా మారి ఇదేందని ప్రశ్నించిన వారిని భయవూభాంతులకు గురిచేస్తున్నారు.

కొండపాక: కొండపాక మండలం మేథినీపూర్ గ్రామంలో ఇటుక వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతున్నది. గ్రామంలో సుమారు 20ఎకరాల విస్తీర్ణంలో జిల్లాలో మరెక్కడా లేనంతగా భారీ ఎత్తున అనేక ఏండ్లుగా అక్రమ ఇటుక దందా నడుస్తున్నది. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వ్యాపారం ఇష్టారాజ్యంగా మారిపోయింది. దీంతో అక్రమ ఇటుక వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ యేటా లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. చదువురాని కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడితూ బాలకార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. వ్యవసాయ బావులు, బోర్ల పేరుతో ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందిస్తున్న కరెంటును అక్రమంగా వాడుకుంటున్నారు. చెరువులను, పంటపొలాలను ధ్వంసం చేస్తూ మట్టిని ఇష్టారాజ్యంగా ఈ తీసుకవచ్చి ఇటుకలను తయారు చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇటుబట్టీలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి అక్రమార్జనతో ఇటుకు వ్యాపారులు మాఫియాగా మారి, ఇదేమిటని అడిగిన వారిని భయవూబాంతులకు గురిచేస్తున్నారు.

కార్మికుల శ్రమదోపిడీ
ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు దారణమైన శ్రమదోపిడీకి గురవుతున్నారు. చదువు రాకపోవడంతో ఇటుక బట్టీల యాజమానులు వీరికి న్యాయంగా రావాల్సిన డబ్బులను ఇవ్వకుండా రాత్రనకా, పగలనకా పనిచేయిస్తున్నారు. మేధీనీపూర్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఇటుకబట్టీల్లో ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుం చి కార్మికులను తీసుకవచ్చి వారితో బట్టీల్లో పని చేయిస్తూ కా ర్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. ఇటుక బట్టీల వద్దనే వారికి గుడారాలను వేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు.

బట్టీల్లో బాల కార్మికులు
మేథినీపూర్ శివారులో భారీ ఎత్తున అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకబట్టీల్లో బాల కార్మికులు మగ్గిపోతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి పనిచేసేందుకు వచ్చిన కార్మికుల పిల్లలు బడికి వెళ్లకుండా తల్లిదంవూడులతో పాటు పని చేస్తున్నారు. పలక బలపం పట్టి చదువుకోవాల్సిన ఆ చిన్నారి చేతులు మట్టి పిసుకుతూ ఇటుకలను తయారు చేస్తూ, ఇటుక బట్టీల పొగలో మసిబారి పోతూ అక్రమ వ్యాపారులకు కాసులు సంపాదించి పెట్టె యంత్రాలుగా మారిపోతున్నారు. కార్మికశాఖ, శిశుసంక్షేమ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు.

అనుమతులు నిల్లు... వ్యాపారం పుల్లు...
అక్రమ వ్యాపారుల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటుక వ్యాపారులు జోరుగా తమ అక్రమదందాను కొనసాగిస్తున్నారు. భూ పరిరక్షణ చట్టం 129/12లో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి పనికి రాని భూముల్లో మాత్రమే ఇటుక బట్టీలు నిర్వహించాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పంట భూముల్లోనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అధికారులకు మామూళ్లు ఇచ్చి, అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. పచ్చని పంట పొలాలు ఇటుక బూడిదతో నిండిపోయి బీడుగా మారుతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పొలాల పక్కనే ఇటుక బట్టీలు నిర్వహిస్తుండడంతో ఆ ప్రభావం వాటిపై పడి పంటలు నష్టపోతున్నాయి. రెవెన్యూ చట్టం ప్రకారం ఇటుక బట్టీలు నిర్వహించే భూములకు నాలా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి అవసరం. కానీ, జిల్లాలో ఎక్కడ కూడా అలాంటి అనుమతులు ఉన్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే కొన్ని చోట్ల ఇటుక బట్టీల వ్యాపారులు అటువైపు నుంచి ప్రవాహిస్తున్న వాగుల్లోనే ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి ఇటుకల తయారీ కోసం నీళ్లు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందిస్తున్న 24గంటల కరెంటును ఇటుక బట్టీల నిర్వాహకులు దొంగతనంగా వాడుకుంటున్నారు. బొగ్గు, కలప ఇతర వనరులను అనుమతి లేకుండానే ఇటుక బట్టీల్లో ఉపయోగిస్తున్నారు. అక్రమ ఇటుక వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై అధికారులు తీవ్ర స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలి స్థానిక ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా బట్టీల్లో మగ్గుతున్న బాల కార్మికులను బడికి పంపి, కార్మికులకు సరైనా కూలీ డబ్బులను అందజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...