వచ్చే వానకాలం నాటికి గోదావరి నీళ్లు


Sat,November 10, 2018 11:42 PM

-ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌ది
-ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
-తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే లక్ష్యం
-రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్
-తెలంగాణ ఉద్యమంలో ముదిరాజ్‌ల పాత్ర కీలకం
-ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు
-హుస్నాబాద్‌లో ముదిరాజ్ కులస్తులభారీ ఆశీర్వాద సభ
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చే వానకాలం నాటికి మెట్ట ప్రాంతాల్లోని పొలాలన్నింటికీ గోదావరి నీరు వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్‌లో జరిగిన హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల ముదిరాజ్ కులస్తుల ఆశీర్వాదసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే పనులు పూర్తయి మెట్ట ప్రాంతాలకు నీళ్లు వస్తాయన్నారు. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లు పూర్తయితే చెరువులు, కుంటలు నిత్యం నీటితో కళకళలాడుతాయన్నారు. రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించిందన్నారు. చెరువులు, కుంటలపై హక్కులను కల్పించడంతోపాటు ముదిరాజ్‌లకు ఉచితంగా కోట్లాది చేపపిల్లలను సరఫరా చేసిందన్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యాన్‌లు, బొలేరోలను కూడా సబ్సిడీపై అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణను దోచుకున్న వారు మళ్లీ ఎన్నికలకు వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ముదిరాజ్‌లందరూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో జీవించడమే లక్ష్యం బండ ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడుతెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో జీవించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని రాజ్యసభ సభ్యు డు బండ ప్రకాశ్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ, అమరావతిలో తాకట్టుపెట్టబోతున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మనకు తెలంగాణ సర్కారు కావాలి గాని ఢిల్లీ సర్కారు వద్దన్నారు. ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం ప్రభు త్వం పెద్దఎత్తున నిధులు కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు రూ.40కోట్ల విలువైన వాహనాలను సబ్సిడీ ద్వారా అందించామన్నారు. రాష్ట్రంలోని 60వేల మందికి ద్విచక్ర వాహనాలు, 4,500మందికి టాటాఏస్‌లు, 3,500మందికి వ్యాన్‌లు, 500మందికి బొలేరో వాహనాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ముదిరాజ్‌ల పాత్ర కీలకం
-నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్సీ
తెలంగాణ ఉద్యమంలో ముదిరాజ్‌ల పాత్ర కీలకమైనదని, అదే స్ఫూర్తితో మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 56మంది ముదిరాజ్ యువకులు, ఉద్యోగులు ప్రాణత్యాగం చేశారన్నారు. వారి కల నిజం కావాలంటే బంగారు తెలంగాణ కోసం పాటు పడుతున్న కేసీఆర్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ముదిరాజ్ కులస్తులు అధిక శాతం ఉన్నారని, వీరందరూ తల్చుకుంటే సతీశ్‌కుమార్ భారీ మెజార్టీతో గెలుస్తాడన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేయాలి తప్ప అక్రమ పొత్తులు పెట్టుకొని అధికారమే లక్ష్యంగా పెట్టుకన్న వారికి ఓటు వేయొద్దన్నారు.


మళ్లీ ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
వొడితెల సతీశ్‌కుమార్, టీఆర్‌ఎస్ అభ్యర్థి
హుస్నాబాద్ నియోజవకర్గ ప్రజలు మళ్లీ గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలోని ముదిరాజ్ కులస్తుల కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని, పలు సంఘాలకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు ఇప్పించామన్నారు. తనకోసం భారీ సంఖ్యలో ముదిరాజ్‌లు తరలిరావడం ఆనందంగా ఉన్నదని, సభను విజయవంతం చేసిన ముదిరాజ్ సంఘం నాయకులు, కార్యకర్తలు, కులస్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల నుంచి వచ్చిన ముదిరాజ్ కులస్తులు హుస్నాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా, మెయిన్‌రోడ్డు, మల్లెచెట్టు చౌరస్తా మీదుగా సిద్దిపేట రోడ్డులోని తిరుమల గార్డెన్ వరకు ర్యాలీ కొనసాగింది. వందలాది మంది ముదిరాజ్ మహిళలు కోలాటం ఆటలు ఆడుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. మత్స్య కారులు చేపల వలలు, బుట్టలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకుడు శంకర్‌ముదిరాజ్, ఎంపీపీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, జడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్, నాయకులు వంగ వెంకట్రాంరెడ్డి, మ్యాక నారాయణ, కాసర్ల అశోక్‌బాబు, ఆవుల మహేందర్, ముదిరాజ్ మహాసభ నాయకులు సన్నీళ్ల వెంకన్న, పెండెల అయిలయ్య, గూల్ల రాజు, చొప్పరి శ్రీనివాస్, బాల్‌రాజు, గూళ్ల భిక్షపతి, గీకురు వెంకటేశం, రాజయ్య, గీకురు రవీందర్, గంగాధరి రాజయ్య, కొప్పు బాబు, తాట్ల యాదమ్మ పాల్గొన్నారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...