చంద్రబాబు ఎత్తులను తిప్పికొట్టాలి


Sat,November 10, 2018 11:39 PM

గజ్వేల్ టౌన్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉందని, ఆయన చెప్పినవారికే నేడు టికెట్లను కేటాయిస్తూ పార్టీని బాబుకు అప్పగించారని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫుడ్స్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డిలు విమర్శించారు. శనివారం ప్రజ్ఞాగార్డెన్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహాకూటమిలో టీజేఎస్, సీపీఐ ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని చూడడంతో ఆయా పార్టీల నాయకుల్లో అసహనం వ్యక్తమవుతుందన్నారు. కాంగ్రెస్ సీట్ల పంపక విధానం సమాలోచనలు చంద్రబాబుకు అప్పగించారని, ఆయన చేతిలో నేడు కాంగ్రెస్ నేతలు కీలుబొమ్మలుగా మారారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కేంద్ర కమిటీ నాయకుడు అశోక్.. అమరావతిలో చంద్రబాబుతో టికెట్ల పంపకం పై మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీ విధానం ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
జాతీయస్థాయిలో పెద్ద పార్టీ అయినా కాంగ్రెస్.. నేడు రాష్ట్రంలో పోటీ చేయడానికి చంద్రబాబు వద్ద అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు డబ్బు, అనుమతి లేనిదే గాంధీ భవన్‌లో ఈగ వాలడం లేదని తెలిపారు. నేడు కాంగ్రెస్ పార్టీ అస్థిత్వాన్ని కొల్పోయి.. దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు.

ఢిల్లీ, అమరావతి కేంద్రాలుగా కాంగ్రెస్ రాజకీయం ముందుకు సాగుతుందని, చంద్రబాబు ఎత్తులను తిప్పికొట్టాల్సిన సమయం ప్రజలకు వచ్చిందని పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రజలు ఓటు తీర్పుతో మరోసారి చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు ఇంటికెళ్లే తీర్పును ఇవ్వాలని కోరారు. ఈఎం కేసీఆర్.. నాలుగేండ్లలో తెలంగాణలోని ప్రతి పల్లెలో సంక్షేమ పథకాలను అమలు చేసి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రతి పల్లెలో సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయన్నారు. కోటి ఎకరాల మాగానికి సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ సర్కార్ అనేక ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఫిర్యాదు చేస్తున్నా ఏనాడు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించలేదని మండిపడ్డారు. మంత్రి హరీశ్‌రావు వేసిన 19 ప్రశ్నాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలు చెల్లవన్నారు. ఆర్టీసీ విభజనలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని, స్క్రాబ్‌కు అవసరమయ్యే బస్సులను తెలంగాణకు కేటాయించడంతో అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారడం, ఆయన చెప్పినట్లు ఇక్కడి నాయకులు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అన్ని సర్వేలు టీఆర్‌ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు. గజ్వేల్‌లో మరోసారి చరిత్రను సృష్టించబోతున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ యాదవరెడ్డి పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...