రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ


Sat,November 10, 2018 11:38 PM

- 12 నుంచి 19వ తేదీ వరకు గడువు
- 20న నామినేషన్ల పరిశీలన
- 22 వరకు ఉపసంహరణ
- డిసెంబర్ 7 పోలింగ్, 11న ఫలితాల వెల్లడి
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేయడానికి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఆర్డీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సోమవారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నది. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు, పోలింగ్ తేదీ డిసెంబర్ 7, డిసెంబర్ 11న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. జిల్లాలోని 4 నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బారికేడ్లు, కౌంటర్స్ తదితర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా 1,102 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ కార్యాలయం నుంచి 100 మీటర్ల పరిధిలోకి 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో సహా ఐదుగురు వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లే అనుమతి ఉంటుంది. నామినేషన్ల పరిశీలనలో భాగంగా అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, ఒక ప్రతిపాదకుడు, మరో వ్యక్తి పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంది.

సిద్దిపేట నియోజకవర్గంలో 2,05,802 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,02,403 మంది, స్త్రీలు 1,03,385 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 2,27,934 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,14,362, స్త్రీలు 1,13, 554 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,18,361 మంది ఓటర్లు ఉం డగా, వీరిలో పురుషులు 1,08,827, స్త్రీలు 1,09,525 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 1,67,666 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 92,453 మంది, స్త్రీలు 95,413 మంది ఉన్నారు. మొత్తం నాలుగు నియోజకవర్గాల పరిధిలో పురుషులు 4,18,045, స్త్రీలు 4,21,877, ఇతరులు 41 మంది మొత్తం 8,39,963 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, నూతనంగా ఓటరుగా నమోదైనవారిలో జిల్లా వ్యాప్తంగా మరో 3 వేల వరకు ఉన్నట్లు అధికారిక సమాచారం.

ప్రచారంలో అభ్యర్థులు..
శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. జిల్లాకు సంబంధించి గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, మొదటి దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఖరారు కాలేదు. ఎవరికీ వారే టికెట్ వస్తుందనే ఆశతో తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...