మీ ఆత్మీయతకు సలాం


Fri,November 9, 2018 11:30 PM

-చివరి శ్వాస దాకా మీకు సేవ చేస్తా..
-కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేటను అభివృద్ధి చేశా..
-దేశంలోనే రెండో స్థానంలో నిలిపా..
-భారీ మెజార్టీతో సీఎంకు కానుక ఇద్దాం..
-టీఆర్‌ఎస్ పాలనలోనే ముదిరాజ్‌లకు సముచిత స్థానం
-నీలకంఠ సమాజానికి రుణపడి ఉంటా..
-భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
-నీళ్లతో ముడిపడిన వృత్తి ముదిరాజ్‌లది..
-మంత్రి ఈటల రాజేందర్
-సిద్దిపేటలో ముదిరాజ్‌ల, నీలకంఠ సమాజం ఆశీర్వాద సభ
-పట్టణంలో భారీ ర్యాలీ.. పోతరాజుల నృత్యాలు.. బోనాలు, కోలాటం
సిద్దిపేట ప్రతినిధి/కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: మీరు చూపిన ఆత్మీయతకు వందనం.. బతికున్నంత కాలం మీకు సేవ చేస్తా.. ఉద్యమంలో, అభివృద్ధిలో ముందున్నాం.. మెజార్టీలోనూ ముందుండాలి.. అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ముదిరాజ్‌ల, నీలకంఠ సమాజం ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభకు మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి హాజరయ్యారు. కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేటను అభివృద్ధి చేసి, దేశంలోనే రెండో స్థానంలో నిలిపానని చెప్పిన హరీశ్‌రావు, రాష్ట్రంలో రికార్డు స్థాయి మెజార్టీని అందించి సిద్దిపేట గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. నీళ్లతో ముడిపడిన వృత్తి ముదిరాజ్‌లదని, ఆ నీళ్లు తెస్తున్న మంత్రి, మీ అభిమాన నాయకుడు హరీశ్ అని మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. పట్టణంలో భారీ ర్యాలీ.. పోతరాజుల నృత్యాలు.. బోనాలు, కోలాటం ఆకట్టుకోగా, పెద్దసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో.. ఉద్యమంలో ముం దున్నం.. మెజార్టీలోనూ ముందుండాలి.. పెద్దమ్మతల్లి ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి నా చివరి శ్వాస దాకా మీ సేవ చేస్తా.. మీరు చూపిన ఆత్మీయతకు బతికినంత కాలం మీ వెంట ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా.. వచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రతి చెరువు, కుంట నింపుతానని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన ముదిరాజ్‌ల ఆశీర్వాద సభకు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో రూ.6 కోట్ల విలువ చేసే మూడెకరాల భూమి తోపాటు రూ.3 కోట్లను కేటాయిం చాం. ఫంక్షన్ హాల్‌తో పాటు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి ఊరు లోనూ ముదిరాజ్ సామూహిక భవనాలు నిర్మించుకున్నామన్నారు. సిద్దిపేటలో ప్రతిపక్షాలు ఎవరు పోటీ చేసినా భయపడేది లేదు. రాష్ట్రంలో రికార్డు స్థాయి మెజార్టీని అం దించి సిద్దిపేట గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యమ కాలంలో అప్పటి ప్రభుత్వాలు బడ్జెట్ పెట్టాలంటే 16 మంది శాసన సభ్యులున్న మమ్మల్ని చూసి భయపడేవి. ఉద్యమంలో ఉన్న, మంత్రులుగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశాం. టీఆర్‌ఎస్ నాలుగేండ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ద్యేయంగా సాగింది.

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో 540 గురుకుల పాఠశాలలు, సన్నబియ్యంతో హాస్టల్ విద్యార్థులకు భోజనం, రైతుబంధు చెక్కులు, పెన్షన్లు, కంటి పరీక్షలు చేసి అడుగడుగునా సంక్షేమ పథకాలు అందించామన్నారు. కూటమి అంటేనే సంకీర్ణం.. సంకీర్ణమంటేనే సంక్షోభం.. టీఆర్‌ఎస్ అంటే సంక్షేమమని ప్రజల సంక్షేమానికి కృషి చేసిన టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి దీవించాలన్నారు. స్వయం పాలన, స్వీయ అస్తి త్వం, ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణను మళ్లీ చంద్రబాబు చేతిలో పరాయి పాలనలో పెడుదామా..ఆలోచించండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీట్ల కోసం సిగపట్లు పడుతున్న కూటమి నాయకులు ఢిల్లీలో రాహుల్‌గాంధీ వద్ద, అమరావతిలో చంద్రబాబు వద్ద చేతులు కట్టుకొని నిలబడుతున్నారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్‌కు అండగా ఉందామని పిలుపునిచ్చారు. అడుగడుగున తెలంగాణ అడ్డుకున్న చంద్రబాబు వైపు ఉందామా.. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేసే సీఎం కేసీఆర్ వైపు నిలబడుదామా అని ఆలోచించి ఓటు వేయాలన్నారు. సిద్దిపేటలో బీజేపీ పోటీ చేస్తుంది. బీజేపీ ఏం చేసిందని ఓటు వెయ్యాలి. బీసీల కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేని మోడీకి ఎట్లా ఓటు వేస్తాం.. నోట్ల రద్దు చేసి పైసల కోసం ప్రజలను లైన్‌లో నిలబెట్టిన బీజేపీకి ఎలా ఓటు వేద్దామన్నారు. రాష్ట్రం ఏర్పాటుతోనే 7 మండలాలను ఆంధ్రాలో కలిపి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు రెండే అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు. టీఆర్‌ఎస్ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే మనం నిర్ణయాత్మక శక్తిగా ఉంటాం. అప్పుడు మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ అవకాశవాద పార్టీలన్నారు.

టీఆర్‌ఎస్‌కు అండగా నిలుద్దాం రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ముదిరాజ్
ముదిరాజ్‌ల సంక్షేమం కోసం కృషి చేసిన టీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ముదిరాజ్‌లంతా అండగా నిలుద్దామని రాజ్యసభ సభ్యుడు ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడింది ముదిరాజ్‌లే అన్నారు. మన కోసం మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులు ఆపుతున్న వారు మనకు శత్రువులు.. నీళ్లు తెచ్చే వారు మనకు మిత్రులన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో స్వాతంత్య్ర భారతంలో తొలిసారిగా ఒక ముదిరాజ్ బిడ్డగా నేను రాజ్యసభ సభ్యున్ని అయ్యానన్నారు. ముదిరాజ్‌లు ప్రతి ఇంటింటికీ వెళ్లి హరీశన్నకు లక్ష ఓట్ల మెజార్టీ వచ్చే విధంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

నీళ్లతో ముడిపడిన వృత్తి ముదిరాజ్‌లది ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
నా తెలంగాణ మట్టి తల్లి నీరు లేక అగోలిస్తూ ఉంటే.. ఆ నేలతల్లికి నీళ్లివ్వాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నది సిద్దిపేట గడ్డమీద పుట్టిన సీఎం కేసీఆర్.. దానిని అమలు చేస్తున్న మంత్రి హరీశ్‌రావులని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చెట్లు పెంచాలన్న, చేపలు పట్టాలన్న నీళ్లు కావాలి.. ఆ నీళ్లతో ముడిపడిన వృత్తి ముదిరాజ్‌లది.. నీళ్లు తెస్తున్న మంత్రి, మీ అభిమాన నాయకుడు హరీశ్ అని చెప్పారు. మత్స్యకారులను కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్. ముదిరాజ్‌ల ఆరా ధ్య దైవమైన పెద్దమ్మతల్లి దేవాలయాలతో పాటు గ్రామ దేవతల ఆలయాల నిర్మాణానికి బాజప్తాగా ప్రభుత్వం ఒక్కో ఆలయ నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయించి నిర్మిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మత్స్యకారుల కోసం మంత్రి హరీశ్‌రావు, నేను కొట్లాడి కొన్ని నిధులు సాధించామన్నారు. కొట్లాడి మత్స్యకారులకు భవనాలు తెస్తే అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాటిని బంద్ చేయించారన్నారు. కానీ నేడు అన్ని గ్రామాల్లోను ముదిరాజ్ కమ్యూనిటీ భవనాలు నిర్మించుకుంటున్నామన్నారు. సొసైటీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ 70 ఏండ్ల స్వాతంత్య్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముదిరాజ్‌లకు రాజ్యసభ సభ్యత్వం కల్పించడంతో పాటు రాష్ట్రంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇచ్చారన్నారు.

రాబోయే కాలంలో ముదిరాజ్‌లకు అన్ని రంగాల్లోను సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మనందరికీ అండగా ఉన్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలన్నారు. కరెంట్ అడిగితే కాల్చి చంపిన చంద్రబాబు, కరెంట్ కోతలతో రైతుల ఉసురు పోసుకున్న కాంగ్రెస్ పార్టీలు కూటమిగా వచ్చి విషప్రచారం చేస్తున్నాయి. వారి కుట్రలను చేధించి కారు గుర్తుకు ఓటు వేయాలి. మంత్రి హరీశ్‌రావుపై బురదజల్లుతూ విషప్రచారం చేస్తున్న కూటమి నాయకుల్లారా ఖబడ్దార్ అం టూ ఈటల హెచ్చరించారు. మీకు మమ్మల్ని ఎదుర్కొనే సత్తా, దమ్ము ఉంటే మేమడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండంటూ ప్రతిపక్ష నాయకులకు ఈటల ఘాట్‌గా ప్రశ్నించారు. సిద్దిపేటలో గతంలో హరీశ్‌రావుకు మీరిచ్చిన మెజార్టీని ఎవ్వరు బ్రేక్ చెయ్యలేరు. ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలి. ప్రతి ముదిరాజ్ బిడ్డ ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొప్పరి శంకర్ ముదిరాజ్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కార్యదర్శి తుపాకుల బాల్‌రంగం ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, నాయకులు మల్యాల బాల్‌రాజు , జంగిటి కనకరాజు, వై.ధర్మ, బర్ల మల్లికార్జున్, మల్యాల ప్రశాంత్, బోనాల నర్సిం లు, ఆయా మండలాల ముదిరాజ్ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బోనాలు, పోతరాజుల నృత్యాలతో సభాస్థలికి చేరుకున్నారు. సాయిచంద్ ఆటపాటతో ఆకట్టుకున్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...