కేసీఆర్‌కు కానుక ఇద్దాం


Fri,November 9, 2018 12:27 AM

సిద్దిపేట ప్రతినిధి/కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్.. సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం.. మీ దీవెనలతో ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. సిద్దిపేట అంటే మీరు గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేసి, మీ గౌరవాన్ని కాపాడా. సిద్దిపేట అసెంబ్లీ స్థానాన్ని రికార్డు మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమానంగా ఇద్దాం.. అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా యాదవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఫెడరేషన్ చైర్మన్ రాజయ్యయాదవ్‌లతో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్రాబాబు చేతిలో పెడుదామా?.. ఆలోచించండి.. ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు సీట్ల కోసం ఢిల్లీకి, తెలుగుదేశపోళ్లు అమరావతి బాట పట్టారు.. టీఆర్‌ఎస్ మాత్రం తెలంగాణ ప్రజలే అధిష్ఠానంగా మీ వద్దకు వచ్చింది.. అని అన్నారు. సీఎం కేసీఆర్ దయతో సిద్దిపేట జిల్లా అయింది..

యాదవులకు గొర్రెలొచ్చాయి.. సిద్దిపేటలో కార్పొరేట్ దవాఖానకు దీటుగా సకల సౌకర్యాలతో ప్రభుత్వ వైద్యశాలను నిర్మించాం.. అని చెప్పారు. మీరు మల్లన్న పండుగ చేసుకున్నా.. మీకు కష్టమొచ్చినా.. మీ కుటుంబ సభ్యుడిలా మీ వెంటే ఉన్నా.. అని అన్నారు. ఎదిగే కొద్ది.. ఒదిగి ఉండాలని సీఎం కేసీఆర్ నేర్పించారు. మీరు చూపుతున్న ఆదరణతో, మల్లన్న దేవుని దయతో మీకు సేవ చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో యాదవులకు కమ్యూనిటీ హాల్ కట్టినం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు 90శాతం పూర్తయింది. వచ్చే వానకాలం నాటికి కాలమైన కాకున్న నియోజకవర్గంలోని ప్రతి కుంటను, చెరువును నింపుతాం.. అని చెప్పారు. ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు వానకాలం వస్తే ఊషిళ్లు వచ్చినట్లు వస్తారన్నారు. నియోజకవర్గంలో ఊర్లు ఎన్ని ఉన్నాయో?.. ఏ తొవ్వ ఎక్కడుందో తెల్వనోళ్లకు ఓటేద్దామా?.. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకొని సేవ చేసిన వ్యక్తికి ఓటు వేద్దామా? ఆలోచించండి.. అని చెప్పారు. కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబునాయుడు మళ్లీ వస్తున్నాడన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు. కాంగ్రెస్ కొట్లాటంతా కుర్చీ కోసమే అన్నారు. మీరంతా నెల రోజులు మాట సాయం చేసి అండగా నిలవండి.. ఐదేండ్లు నేను మీకు సేవ చేస్తా.. అని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.

101 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం : మంత్రి తలసాని
రానున్న శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 101 స్థానాల్లో విజయం సాధిస్తుంది. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేండ్లలో చేసి చూపింది. యాదవుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. సిద్దిపేటలో నామినేషన్ వేయాలంటే ప్రతిపక్ష నాయకులకు భయం పుడుతున్నదన్నారు. నాలుగున్నరేండ్లలో తెలంగాణ రైతాంగానికి నీరు అందించేందుకు 18గంటలు కష్టపడ్డ నాయకుడు మంత్రి హరీశ్‌రావు అని కొనియాడారు. ఎన్నికలు రాగానే దొంగలంతా ఒకటయ్యారని, గడ్డం మీసాలు పెంచుకుంటే ఎన్నికల్లో గెలుస్తారా? ప్రజలకు సేవ చేస్తేనే ఎమ్మెల్యేలుగా గెలుస్తారన్నారు. 40ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఎందుకు రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆలీబాబా.. 40 దొంగల్లాగా.. మహాకూటమి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏండ్లు గడిచినా, యాదవులకు మాత్రం సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. జనంలో ఆదరణ లేకపోవడంతో ఓడిపోతామనే భయంతో మంత్రి హరీశ్‌రావుపై కొంత మంది దొంగలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వారిని తిప్పికొట్టాలని సూచించారు. యాదవుల ఇష్టదైవం కొమురవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసింది టీఆర్‌ఎస్సే అన్నారు. యాదవులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు 70 లక్షల గొర్రెలను సీఎం కేసీఆర్ పంపిణీ చేశారన్నారు. యాదవులంతా గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ చెప్పి టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేయించాలన్నారు. కాగా, సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సభలో సాయిచంద్ ఆటాపాట సభికులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు రమేశ్, పోచబోయిన శ్రీహరియాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఐలయ్యయాదవ్, దువ్వల మల్లయ్య, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్ యాదవ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌యాదవ్, ఉమారాణి, నాయకులు పయ్యావుల రాములు, గిరియాదవ్, ములకల కనకరాజు, కాల్వ ఎల్లయ్య, రాజేశం, మూడు మండలాల అధ్యక్షులు గుండెల్లి రాజయ్య, ఉడుత రవి, శ్రీకాంత్‌యాదవ్, ఎద్దు యాదగిరియాదవ్‌తో పాటు దాబా యాదగిరి, స్వరూప, ఐలయ్య, చైతన్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

245
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...