ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలి


Tue,September 11, 2018 11:41 PM

-కలెక్టర్ కృష్ణభాస్కర్
సిద్దిపేట రూరల్ : ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలకు ఆదేశించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ నవీన్, అటవీశాఖ, ఉద్యానవన, ఎక్సైజ్, వ్యవసాయశాఖ అధికారులతో తెలంగాణకు హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రజలకు ఏ చెట్లు అవసరముంటాయో ప్రజల అభిరుచులకు అనుగుణంగా, ప్రణాళికబద్ధంగా ముందుగానే విత్తనాలు తెప్పించి నర్సరీల్లో మొక్కలను పెంచాలన్నారు. ఈ మేరకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దిశా నిర్దేశం చేస్తూ ఆ దిశగా పనులు త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. డీఆర్‌డీఏ ద్వారా 291 లక్షలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 121 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

జిల్లాలోని 321 గ్రామ పంచాయతీల్లో 291 లక్షల మొక్కల పెంపకం కోసం ప్రతిపాదించగా, ఇప్పటికే 160.2 లక్షల మొక్కల పెంపకం ప్రతిపాదన పూర్తయినట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 358 గ్రామ పంచాయతీల వారీగా 217 గ్రామాల్లో గ్రామ సభలు చేపట్టినట్లు ఇంకా 141 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు ఈ వారం రోజుల్లో నిర్వహించనున్నట్లు ఎంపీడీవోలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో హరితహారం లక్ష్యం 173.14 లక్షలకు గానూ 118.81 లక్షల వరకు పూర్తి చేశామని ఇంకా 54.33 లక్షల మొక్కలను నాటడం మాత్రమే మిగిలి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. సమీక్ష సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అవిశ్వాంత్‌పండా, అటవీ శాఖ రేంజ్ అధికారులు రామారావు, శ్యాంసుందర్, లక్ష్మణ్, ఉద్యాన వన శాఖ డీడీ రామలక్ష్మి, ఎక్సైజ్ శాఖ అధికారి విజయభాస్కర్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...