ప్రజాశీర్వాదానికి పదండి


Mon,September 10, 2018 11:58 PM

-గడప గడపకూ వెళ్లండి.. చేసిన పనులు వివరించండి
-ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావొద్దు..
-కొత్త ఓటర్ల నమోదులో నాయకులు చొరవ చూపాలి
-భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
-సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో
-లక్ష ఓట్ల మెజార్టీని బహుమతిగా ఇస్తామన్న పార్టీ శ్రేణులు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గడప గడపకు వెళ్లండి.. మనం ప్రజలకు చేసిన సేవలను వివరించండి.. పట్టు విడువకుండా పనిచేయండి.. చేసిన ప్రగతిని ప్రజల ముందుంచి ప్రజల ఆశీర్వాదం కోరుదామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుడా కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నద్ధత, ప్రచార వ్యూహం, కొత్త ఓటర్ల నమోదుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. బూత్‌స్థాయి నుంచే ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మనం ప్రజాసేవలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నామని సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. సిద్దిపేటను అభివృద్ధిలో రాష్ట్రంలో నంబర్ -1గా నిలిపామన్నారు. మనం చేసిన ప్రతి పనిని ప్రజల ముందుంచాలన్నారు. ప్రజల సహకారంతో సిద్దిపేట నియోజకవర్గం జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్దిపేట కుటుంబ సభ్యుడిగా నిరంతరం ప్రజాసేవలో అందుబాటులో ఉండి అభివృద్ధి చేశానని,

అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీ గెలుపు బాధ్యతలను మనపై ఉంచిందని నాలుగైదు జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట టీఆర్‌ఎస్ శ్రేణులు కష్టపడి పనిచేయాలన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా కార్యకర్తలు నిరంతరం శ్రమించాలన్నారు. ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్లు నమోదు చేసే అవకాశం ఈ నెల 25 వరకు కల్పించిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ఇంతకు ముందు తొలగించిన ఓట్లపై కూడా దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు కూర మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు పాల సాయిరాం, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులున్నారు.

లక్ష ఓట్ల మెజార్టీ బహుమతిగా ఇస్తాం
- సిద్దిపేట టీఆర్‌ఎస్ శ్రేణులు
సిద్దిపేట ప్రజల కోసం నిరంతరం మీరు కృషి చేశారు. మాకు అన్నగా, కుటుంబ సభ్యుడిగా ప్రతి కష్టంలోనూ అండగా నిలిచారు. అభివృద్ధి అంటే సిద్దిపేట అని దేశంలో గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లారు. మీకు లక్ష ఓట్ల మెజార్టీని బహుమతిగా ఇస్తామని సిద్దిపేట టీఆర్‌ఎస్ శ్రేణులు మంత్రి హరీశ్‌రావుకు తెలిపారు. ప్రతి గ్రామంలోను దాదాపుగా ఏకగ్రీవం చేసే దిశగా ముందుకు పోతామన్నారు. గ్రామాల్లోని అన్నివర్గాల ప్రజలకు మీరు చేసిన అభివృద్ధిపై వివరిస్తామన్నారు. ప్రజలు సైతం మీ వెంటే ఉన్నారన్నారు. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...